రైతుల భారీ ఆందోళన.. పెనుగొండలో రాస్తారోకో
ప్రజాశక్తి- పెనుగొండ: డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, నక్కల కాలువలో పేరుకుపోయిన చెత్త కారణంగా పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయని ఆరోపిస్తూ పెనుగొండలో సుమారు 300 మంది రైతులు ఆందోళనకు దిగారు. దాదాపు 1000 ఎకరాల ఆయకట్టు ముంపునకు గురై పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పెనుగొండ ప్యాలెస్ రోడ్ సెంటర్‌లో రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పెనుగొండ–నిడదవోలు ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
పెనుగొండ డంపింగ్ యార్డ్ కారణంగా పంట పొలాల్లోకి ముంపునీరు చేరుతోందని రైతులు ఆరోపించారు. మరోవైపు నక్కల కాలువలో చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి, వర్షపు నీరు పొలాల్లోకి చేరుతోందని తెలిపారు. ఇటీవల తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే పంటలు నష్టపోయామని, తాజాగా ముంపు కారణంగా మరింత నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు పూర్తిగా దెబ్బతినడంతో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని కన్నీటిపర్యంతమయ్యారు. డంపింగ్ యార్డ్‌ను తక్షణమే తొలగించాలని, నక్కల కాలువలో పేరుకుపోయిన చెత్తను యుద్ధ ప్రాతిపదికన తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలని రైతులు డిమాండ్ చేశారు. తుఫాన్, వరద ముంపుతో నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ఆందోళన విరమించాలని పోలీసులు కోరడంతో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే డంపింగ్ యార్డ్ తొలగింపు, కాలువలో చెత్త తొలగింపు, పంట నష్టపరిహారం అందించే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. తమ సమస్యలకు పరిష్కారం చూపే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.








కామెంట్‌లు (0)