బోలేబాబా, శ్రీ వైష్ణవి డెయిరీలకు చెందిన రూ.129.85 కోట్ల ఆస్తుల జప్తు
మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ముమ్మరం
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ, శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ సంస్థలతో పాటు వాటి ప్రమోటర్లు, కుటుంబ సభ్యులు, సంబంధిత సంస్థలకు చెందిన మొత్తం రూ.129.85 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద ఈ చర్య చేపట్టింది.
రూ.234 కోట్ల నెయ్యి సరఫరా!
టిటిడికి భారీ మొత్తంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో బోలేబాబా డెయిరీ కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ సంస్థతోపాటు శ్రీ వైష్ణవి డెయిరీ, ఇతర సంబంధిత సంస్థల ద్వారా నెయ్యి సరఫరా జరిగినట్లు విచారణలో వెల్లడైన అంశాలను ఇడి పరిశీలిస్తోంది. టిటిడికి సరఫరా చేసిన నెయ్యి విలువ రూ.234 కోట్లుగా పేర్కొంటున్నప్పటికీ, ఈ సరఫరాలకు సంబంధించిన లావాదేవీలు, నిధుల ప్రవాహంపై దర్యాప్తు కొనసాగుతోంది.
తెరపైకి నిధుల మళ్లింపు వ్యవహారం
కల్తీ నెయ్యి సరఫరా ద్వారా వచ్చినట్లు అనుమానిస్తున్న ఆదాయాన్ని వివిధ సంస్థల లావాదేవీల ద్వారా మళ్లించినట్లు ఇడి ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో నిధుల మూలాలు, వాటి వినియోగం, సంబంధిత వ్యక్తుల ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. జప్తు చేసిన ఆస్తుల్లో సంస్థలు, వాటి ప్రమోటర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులతోపాటు సుకృతి ఫుడ్స్, దాని ప్రమోటర్ కైలాశ్ చంద్ర మంగళకు సంబంధించిన ఆస్తులు కూడా ఉన్నట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీలు, అక్రమ సంపాదన ఆరోపణలపై ఇడి దర్యాప్తును ముమ్మరం చేసింది.







కామెంట్లు (0)