బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గన్నవరం విమానాశ్రయ నిర్వాసితుల అక్రమ అరెస్టులపై సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర ఖండన

1 గంట క్రితం

CPI(M) State Committee strongly condemns illegal arrests of Gannavaram Airport residents
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 05:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : నష్ట పరిహారం కోసం గత 16 రోజులుగా శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న గన్నవరం విమానాశ్రయ నిర్వాసితులను వారికి మద్దతుగా నిలిచిన నాయకులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నెపంతో పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. విమానాశ్రయ విస్తరణ, ఏలూరు కాలువ మళ్లింపు పేర్లతో గత 13 ఏళ్లుగా వెయ్యి పేద కుటుంబాలకు చెందిన నివాసాలు, నివేశన స్థలాలు స్వాధీనం చేసుకుని ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. బాధితుల ప్రతినిధి వేదవతి, తిరివీది ఏసురత్నం తదితరులను అదుపులోకి తీసుకోవడం గర్హనీయమన్నారు. తన ఆవేదనను వ్యక్తం చేస్తూ సమస్య తీర్చాలని కోరిన వేదవతిని మహిళ అనే విచక్షణ లేకుండా గన్నవరం వెంకటేశ్వర థియేటర్ సెంటర్‌లో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడం అప్రజాస్వామికం అని ధ్వజమెత్తారు. నిర్వాసితులకు అండగా ఉన్న సిపిఐ(యం) మండల కార్యదర్శి మల్లంపల్లి ఆంజనేయులు, నాయకులు బడుగు మర్యాద దాసు, మిరప నాగేశ్వరరావు, సిపిఐ నాయకుడు కాట్రగడ్డ రామచంద్ర జోషి, ఇళ్లపై బడి అరెస్టు చేయడం దారుణమన్నారు. అరెస్టయిన వారిని ఏ స్టేషన్‌లో ఉంచారనే కనీస సమాచారం ఇవ్వకపోవడం, ఇతర ప్రాంతాలకు తరలించడం హేయమైన చర్య అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించలేకనే ప్రభుత్వం ఇలాంటి దమనకాండకు పాల్పడుతోందని ఆరోపించారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను పోలీసు నిర్భంధం ద్వారా కాకుండా నష్టపరిహారం చెల్లించి, సమస్యను పరిష్కరించాలని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్