- నేటినుంచి కలెక్టర్ల సదస్సు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి రాష్ట్రాన్ని వణికిస్తున్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపైనే కలెక్టర్ల సదస్సులో ఎక్కువగా చర్చ జరగనుంది. నేటి నుండి జరగనున్న ఈ సదస్సులో అనేక ఇతర అంశాలు కూడా ప్రసస్తావనకు రానున్నప్పటికీ ప్రధానంగా ఎల్ నినోపైనే చర్చించనున్నట్లు సమాచారం. తొలిరోజు అత్యంత కీలకమైన అంశాల్లో ఎల్‌నినో కార్యాచరణ ప్రణాళిక ఒకటిగా అజెండాలో పొందుపరిచారు. నీటి వనరులు, ప్రాథమిక రంగం, తాగునీరు, ఎల్‌నినో ప్రభావం, వేతన ఉపాధి సుమారు రెండు గంటల పాటు సమీక్ష జరగనుంది. వ్యవసాయం, పశుసంవర్ధక, జలవనరులు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్ శాఖలతో ఈ చర్చ ఉంటుంది. తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోతుండడం, రైతులు పంట నష్టపోతుండడం, తాగునీటికి కటకట, పశుగ్రాసం కొరత వంటి అంశాలపై చర్చించి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయనున్నారు. ఈ సదస్సులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ రంగాల్లో జిల్లాల అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమ పథకాలు, ఇ-గవర్నెన్స్, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి, భూ పరిపాలన, విద్యుత్, శాంతిభద్రతలు తదితర అంశాలపైనా చర్చించి సూచనలు చేయనున్నారు. ఇదే సమయంలో సంక్షేమం, అభివృద్ధి, పథకాల అమలుపైనా సమీక్ష చేయనున్నారు. రెండోరోజు శాంతిభద్రతలపై కూడా విశ్లేషించనున్నారు. గత సదస్సుల్లో జరిగిన చర్చల ఫలితాలపైనా చర్చ జరగనుంది. అయితే ఈ చర్చలు ఎంతవరకు ఫలితాలు ఇస్తాయన్నది చూడాలి. గత సదస్సుల్లో ఆశించిన స్థాయిలో చర్చలు జరగలేదని, కేవలం వినడానికే పరిమితమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. అందుకే గత కలెక్టర్ల సదస్సుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ఈసారి సమావేశాల షెడ్యూల్‌ను జవాబుదారీతనంతో, గణాంకాలతో సమీక్షించాలని భావిస్తున్నారు. తమ జిల్లాల సమస్యలను నేరుగా ప్రస్తావించేందుకు ప్రత్యేక ఓపెన్ ఫోరం కూడా ఏర్పాటు చేయడం వల్ల ఫలితాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇళ్ల స్థలాలు, గృహాలు, పారిశుధ్యం, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, గ్యాస్, విద్యుత్, రహదారుల అనుసంధానం, వీధి దీపాలు, మౌలిక వసతులు వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు.







కామెంట్‌లు (0)