మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభవిత కోసమే యువత పోరాటం!

1 గంట క్రితం

dyfi sabha.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 12:18 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • డివైఎఫ్ఐ ఆలిండియా ఉపాధ్యక్షులు జాక్ సి. థామస్

  • ఘనంగా రాష్ట్ర మహాసభ ప్రారంభం

  • ఆకట్టుకున్న ర్యాలీ

ప్రజాశక్తి - నెల్లూరు ప్రతినిధి : భవిష్యత్‌ ‌ కోసమే దేశ వ్యాప్తంగా యువత పోరాటం చేస్తోందని డివైఎఫ్ఐ ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు జాక్ సి, థామస్ అన్నారు. నెల్లూరులో మూడ్రోజులపాటు జరగనున్న డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభ సందర్భంగా మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. విఆర్‌సి మైదానం నుంచి ప్రారంభమైన రాలీ ట్రంకురోడ్డు,గాంధీబొమ్మ, సుందరయ్య బొమ్మ మీదుగా నర్తకి సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీ నగర ప్రజలను ఆకట్టుకుంది. 16వ రాష్ట్ర మహాసభకు సంకేతకంగా 16 మంది యువతులు డివైఎఫ్‌ఐ పతాకాన్ని చేపట్టి ర్యాలీ ముందు భాగాన నడిచారు. విఆర్ సి సెంటర్ లో సిఐటియు నాయకులు, గాంధీబొమ్మ వద్ద ఐద్వా నాయకులు, సుందరయ్య బొమ్మ వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ర్యాలీకి స్వాగతం పలికారు. యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పించాలని, గంజాయి అంతం, డివైఎప్ఐ పంతం, అంటూ ర్యాలీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం నర్తకీ సెంటర్‌‌లో జరిగిన బహిరంగ సభలో జాక్ సి, థామస్ మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా యువతకు పోరాటం అనివార్యంగా మారిందని అన్నారు. ఆ పోరాటాల్లో డివైఎఫ్‌ఐ ముందుభాగన నిలిచిందని అన్నారు. తమ భవిష్యత్తుతో పాటు, దేశ భవిష్యత్తు కోసం కూడా యువత పోరాడుతున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన జెన్‌ ‌జీ ఉద్యమాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ పోరాటంలో వామపక్ష విద్యార్థి సంఘాలు, యువకులు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారని అన్నారు. . దేశంలో జరుగుతోన్న అనేక ప్రజా ఉద్యమాలు, యువజన ఉద్యమాలకు వామపక్షాలు అండగా నిలుస్తున్నాయని, అదే సమయంలో దేశంలో జరిగే అనేక పోరాటాల్లో యువత పాత్ర కీలకంగా మారుతోందని అన్నారు. దేశంలో నేడు సాధారణ వ్యక్తులు, రైతులు, యువత, విద్యార్థులను బిజెపి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.

ఇటీవల ప్రపంచ దేశాల ఆకలి నివేదిక (హంగర్‌ ఇండెక్స్‌) ‌విడుదలైందని, ప్రపంచలో 125 దేశాల్లో నిర్వహించిన సర్వే వివరాలను ఆ నివేదికలో పేర్కొన్నారని, దానిలో ఇండియా 102వ స్థానంలో ఉందన్నారు. ఆకలి మరణాలు, పేదరికం, కరువుల్లో దేశం ముందుందన్నారు. పొరుగు దేశమైన చైనాలో దీనికి భిన్నమైన పరిస్థితి ఉందని, ఆకలితో బాధపడే పరిస్థితి, చనిపోయే పరిస్థితి అక్కడ ఉండదని, దానికి కారణం అక్కడ సోషలిజం అమలు చేయడమేనని చెప్పారు. అభివృద్ధిలో కూడా ఆ దేశం అమెరికాతో పోటీ పడుతోందన్నారు. మన దేశంలో ఒక్క కేరళ రాష్ట్రం మాత్రమే పేదరికాన్ని జయించిందని, వామపక్షాలు పాలనే దానికి కారణమని అన్నారు. ప్రభుత్వాల విధానాల కారణంగా దేశంలో కేవలం విద్యార్థులు, యువకులతో పాటు, రైతులు కార్మికులు కూడా పెద్ద ఎత్తున పోరాటాల్లోకి వస్తున్నారని చెప్పారు. ఈ సభకు డివైఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి ఎంవి రమణ అధ్యక్ష వహించారు. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై,రాము, జి.రామన్న, డివైఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షులు బిపి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్