మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపేదరికం లేని సమాజానికి కృషి

1 గంట క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 12:16 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఇంకా బాగా జరగాలి

  • ఇందుకోసం సూచనలు, సలహాలు ఇవ్వండి

  • ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తాం

  • ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రజాశక్తి- భీమవరం : రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు, పేదరికం లేని సమాజం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం తమ విధానమన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఇంకా బాగా జరగాలని, ఇందుకోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, మొగల్తూరుల్లో మంగళవారం ఆయన పర్యటించారు. మొగల్తూరులోని హెలిప్యాడ్‌‌కు చేరుకున్న సిఎం అక్కడ నుంచి పాత కాలువ సెంటర్‌‌ సమీపంలో వై.జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడారు. ఏ ఆడబిడ్డా వంట కోసం కష్టాలు పడకూడదనే దీపం పథకం పెట్టామని, ఇప్పుడు దీపం 2.0తో ఏటా మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నామన్నారు. గతేడాది లక్ష మంది డ్వాక్రా మహిళలు ఎంఎస్ఎంఇలుగా ఎదిగారని, ఈసారి లక్ష్యాన్ని మరింతగా పెంచామని తెలిపారు. డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు ‘స్వయం’ అనే బ్రాండ్ ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మన పంటలు కూడా మారాలని సూచించారు. ఆక్వా రైతులకు రూ.12 వందల కోట్లు సబ్సిడీతో రూ.1.50 కే యూనిట్ విద్యుత్ ను అందిస్తున్నామని తెలిపారు.

ఆర్‌‌టిసిలో త్వరలో మహిళా డ్రైవర్లు

ఆర్‌‌టిసిలో త్వరలో మహిళా డ్రైవర్ల వ్యవస్థను తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు. త్వరలో రాష్ట్రమంతా ఎసి బస్సులు తీసుకొస్తామన్నారు. 31 ఏళ్ల క్రితం ఇదే రోజున తొలిసారి తాను ముఖ్యమంత్రినయ్యానని గుర్తుచేసుకున్నారు. 48 ఏళ్ల తన రాజకీయ జీవితంలో మొగల్తూరు ఎన్నోసార్లు వచ్చానన్నారు.

ప్రభుత్వానికి అనుకూలంగా స్థానిక’ సర్వే ఫలితాలు

కూటమి ప్రభుత్వానికి అన్ని సర్వేలూ అనుకూలంగా ఉన్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు తమదేనని చంద్రబాబు పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికలు పెట్టాలని వైసిపి మళ్లీ కోర్టుకు వెళ్లిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వైసిపిని వెంటాడుతోందన్నారు. ఎన్నికల్లో డబ్బులు తీసుకునే కలుషితాన్ని కడిగేయాలని కోరారు. మున్సిపల్, కార్పొరేషన్లో ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయని, ఛైర్మన్, మేయర్‌‌కు ఓటర్లే నేరుగా ఓటు వేసి ఎన్నుకోవచ్చని తెలిపారు.

నేడు ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు

రాష్ట్రానికి పెద్ద ప్రాజెక్టులు తీసుకొస్తున్నామని చంద్రబాబు అన్నారు. శ్రీశైలం మల్లన్న నుంచి మార్కాపురం చెన్నకేశవ స్వామి పాదాల వరకూ నీరు పారించామన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీటిని తీసుకెళ్లి అక్కడి చరిత్రను మారుస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేశామని, రాబోయే రోజుల్లో కృష్ణా-కావేరి నదుల అనుసంధానంతో దేశంలో నీటి సమస్య పరిష్కారం కానుందన్నారు.

జనసేన ఎమ్మెల్యే నాయకర్ పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి

నరసాపురం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ శాఖల పనితీరుపై సమీక్ష చేసిన చంద్రబాబు నరసాపురం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమంపై సమీక్షించారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలోనే పశ్చిమగోదావరి జిల్లా ముందు వరసలో ఉందని, నరసాపురం నియోజకవర్గం మాత్రం వెనకబడి ఉందని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే నాయకర్ ను, ప్రత్యేక అధికారిని వివరణ అడిగారు. ఆశించిన మేర పనితీరు లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారిని తొలగించి, మరో అధికారిని నియమించాలని కలెక్టర్‌‌ను ఆదేశించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, టిడిపి జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ సెల్ సలహాదారు ఎంఎ.షరీఫ్‌, పిఎసి ఛైర్మన్‌ పులపర్తి రామాంజనేయులు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్