మాదిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి
ప్రజాశక్తి-ఒంగోలు సిటీ : ఎస్‌సి సబ్‌ప్లాన్ నిధులు రూ.360 కోట్ల వ్యయంతో ఎస్‌సి యువతకు ఇన్నోవా కార్లు, జెసిబిలు, ఆటోలు తదితర స్వయం ఉపాధి యూనిట్లు అందించే ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోందని మాదిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. ఒంగోలులోని ప్రగతి భవన్‌లో ఉన్న ఎస్‌సి కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దళిత యువతను స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించి ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని నిధులు సమీకరించి ఎస్‌సిల సంక్షేమ కార్యక్రమాలను విస్తరించనున్నామని పేర్కొన్నారు. ఎన్‌టిఆర్ విద్యోన్నతి పథకం ద్వారా యుజి నుంచి పిజి వరకు చదివే ఎస్‌సి విద్యార్థులకు ప్రోత్సాహంతో పాటు విదేశీ విద్యకు అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివే విద్యార్థులకు నీట్, ఐఐటి వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌సిలకు కేటాయించిన షాపింగ్ కాంప్లెక్స్‌లను ఆధునీకరించి ఆదాయ వనరులుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గత వైసిపి ప్రభుత్వం ఎస్‌సిల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసి దళితుల అభివృద్ధిని అడ్డుకుందని ఆరోపించారు. టిడిపి కూటమి ప్రభుత్వం విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సాధికారత రంగాల్లో ఎస్‌సిల సమగ్ర అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్‌సి కార్పొరేషన్ ఇడి కె అర్జున్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)