డిజిపి హరీష్ కుమార్ గుప్తా
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 31 ఘటనలు నమోదయ్యాయని, వీటికి సంబంధించి ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేసినట్లు డిజిపి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. మరో 11 ఘటనల్లో కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని, కనీసం 54 మందిని నిందితులుగా గుర్తించినట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నామినేషన్లను అడ్డుకోవడం, దాడులకు పాల్పడటం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.నమోదైన ఘటనల్లో 22 హింస, ఘర్షణలకు సంబంధించినవి కాగా, తొమ్మిది నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించివేయడానికి సంబంధించినవని తెలిపారు. మొత్తం 16 సందర్భాల్లో పత్రాల ధ్వంసం జరిగినట్లు పేర్కొన్నారు. ఆరు ఘటనల్లో రాళ్లు, కర్రలతో దాడులు, నాలుగు వాహనాలకు నిప్పుపెట్టడం, రెండు నివాస గృహాలపై దాడులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఒక ఇంటిని ఎర్త్‌మూవర్‌తో కూల్చివేయగా, కాల్పుల ఘటన నమోదైందని వెల్లడించారు. ఘర్షణల్లో ఒక కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడగా, పోటీలో ఉన్న అభ్యర్థితో సహా ఇద్దరు వ్యక్తులు విషమ పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు.ఈ ఘటనల్లో టిడిపి, వైసిపి, సిపిఎంఅభ్యర్థులతోపాటు ఒక స్వతంత్ర అభ్యర్థి దాడులకు, అడ్డంకులకు గురయ్యారని తెలిపారు. చట్టాలను ఉల్లంఘిస్తే పార్టీల కతీతంగా
దృఢత్వంతో చర్యలు తీసుకుంటామన్నారు. హింసాత్మక గుంపులను చెదరగొట్టేందుకు మూడు చోట్ల లాఠీచార్జి, ఒక ఘటనలో రెండు బాష్పవాయు గోళాలను ప్రయోగించినట్లు తెలిపారు.వీడియోలు, సిసిటివి దృశ్యాలు, ఫొటోల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా బెదిరింపులు, హింసాత్మక ఘటనలు ఎదురైతే 100, 112కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.







కామెంట్‌లు (0)