శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపొగాకు గిట్టుబాటు ధరకు భరోసా

26 జూన్, 2026

atchhenaidu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 11:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వర్జీనియా పొగాకు రైతులకు నష్టం జరగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సరాసరి ధర కిలోకు రూ.200 కంటే తక్కువ ధరకు కొనుగోళ్లు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలాని, పొగాకు సాగు ఉన్న జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్‌‌ను శుక్రవారం నిర్వహించారు. పొగాకు కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ఎరువుల లభ్యత, పంపిణీ ఏర్పాట్లు తదితర అంశాలపై ఈ సమావేశంలో సమీక్ష నిర్వహించారు. పొగాకు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, కంపెనీలు నిర్ణయించిన నిబంధనలకు లోబడి పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రాష్ట్రంలో యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ సహా అన్ని రకాల ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందేలా నిల్వలు, రవాణా, పంపిణీపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, కృత్రిమ కొరత, నిల్వదాచివేత, అధిక ధరలకు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన పొగాకు బోర్డు 168వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా మంత్రి ప్రస్తావించారు. 2026–27 పంట సంవత్సరానికి మార్కెట్ పరిస్థితులు, దేశీయ, అంతర్జాతీయ డిమాండ్, రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తి పరిమాణాన్ని సుమారు 81 మిలియన్ కిలోలకు నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే, ఎఫ్‌‌సివి పొగాకు మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, కొనుగోలు విధానంలో పారదర్శకత పెంచడం, పంట నియంత్రణ వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకురావడం, రైతులకు మెరుగైన ప్రయోజనాలు కల్పించడం కోసం అన్ని భాగస్వాములతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్