ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionముళ్ల బాటలో పూసిన అనురాగాలు

56 నిమిషాల క్రితం

NELEGULABELU-BOOK.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 08:53 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ప్రేమ.. రెండే అక్షరాలు. కానీ ఎన్నో అనుభూతులను, ఎంతో అనుభవాన్ని పరిచయం చేస్తుంది. కొందరికి తియ్యని జ్ఞాపకాలను ఇస్తే.. మరికొందరికి చేదునిజాలను పరిచయం చేస్తుంది. అలాంటి ప్రేమలో ఇలాంటి ‘‘నీలిగులాబీలు’’ కూడా ఉంటాయి అని రచయితలు మానస ఎండ్లూరి, అరుణ గోగులమండ ఏరికోరి దళిత ప్రేమ కథా సంకలనం తీసుకొచ్చారు. ఇందులో 24 మంది రచయితలు రాసిన ప్రేమ కథలు ఉన్నాయి. కాదు..కాదు.. 24 పచ్చి నిజాలు ఉన్నాయి. దళిత ప్రేమ కథ అంటే జంటలో ఒకరు దళిత అయి ఉన్నారు. దళితులు ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా వివక్షకు గురవుతున్నారు. ఆ వాస్తవాలను కథలుగా మలిచారు రచయితలు. ఈ కథలన్నీ దేశ కుల, మత వ్యవస్థలతో అసమానతలతో పెనవేసుకుపోయిన మన ఆలోచనా విధానాలని తట్టి లేపుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కథలకు ఎంతో కొంత ఊహను జోడించినా నిజం లేకుండా పోలేదు.

ఈ కథలన్నింటిలోనూ సారం ఒక్కటే.. స్వచ్ఛమైన ప్రేమకి కులం, మతం ఉండదు. కానీ జీవించడానికి ఇవన్నీ అడ్డం వస్తాయి. ధైర్యంగా అడుగు ముందుకు వేసినా.. అక్కడక్కడ ముళ్లు గుచ్చుకుంటాయి. అయినా కొందరు నొప్పిని భరిస్తూనే జీవిస్తారు. మరికొందరు ఈ బాధలు తట్టుకోలేక ప్రేమను దూరం చేసుకుంటారు.

ఒక కథలో కులం తక్కువ వాడిని/దాన్ని పెళ్లి చేసుకున్నారని తల్లిదండ్రులే బిడ్డలను చంపుతారు. మరో కథలో ఇంటర్‌‌కాస్ట్‌ ‌పెళ్లి చేసుకున్నారని ఇద్దరికీ ఉద్యోగాలు ఇవ్వరు. నిజంగా ఆఫీసులో పనిచేయించుకోవడానికి కులం ఏ విధంగా అడ్డం వస్తుందో‘పాడు జీవితం...ఇక్కడి ప్రణయ జీవితం’లో రచయిత వేణు మరీదు వాస్తవాన్ని చెప్పారు. మరోకథలో అగ్రకులానికి చెందిన అమ్మాయి-దళిత అబ్బాయిని ప్రేమిస్తుంది. పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకుంటుంది. అతనూ ఎంతో అపూరంగా చూసుకుంటాడు. కానీ చివరికి కన్నవారి మాటలు విని, అతనికి ఉరితాడును ‘‘బహుమతి’’గా ఇస్తుంది. ‘‘డిస్క్లమర్‌’’ కథలో యూనివర్శిటీలో వివాదాల మధ్యే ప్రేమ చిగురిస్తుంది. ఇద్దరూ దళితులే. అందులోని వేర్వేరు ఉపకులాలకు చెందినవారు. కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడే తరగతుల్లోనే అంతర్గతంగా ఉన్న త అడ్డుగోడలు ప్రేమికులను వేరు చేయడం తీవ్ర విచారకరం. ఆధిపత్య సమాజపు కుల జాడ్యాలే దళిత సమాజంలోనూ చొచ్చుకుపోయి, ఒకరినొకరు తక్కువగా చూసుకుంటూ ప్రేమను తిరస్కరించడం ఈ కథలలోని ఆర్ద్రతను, సామాజిక విషాదాన్ని మరింత లోతుగా చాటిచెబుతుంది.

ప్రముఖ బహుజన రచయిత జి. వెంకటకృష్ణ రాసిన 'కుముద్వతి' కథ 'నీలిగులాబీలు' సంకలనంలోని ప్రధాన ఉద్దేశమైన "ప్రేమి'కుల' వివక్ష"ను బలంగా ప్రతిబింబిస్తుంది. కుల అహంకారం, వర్గ భేదాల వల్ల పూవులాంటి సున్నితమైన ప్రేమలు సమాజంలో ఎలా చిధ్రమవుతున్నాయో ఈ కథ చర్చిస్తుంది. ప్రేమను కేవలం ఒక భావనగా కాకుండా, సమాజంలోని సంకెళ్లను తెంచుకుని తిరుగుబాటు చేసే ఒక శక్తిగా ఈ కథలో చూపించడం జరిగింది.

సమాజం విధించిన ఆంక్షలు, కుల వ్యవస్థ నిర్మించిన నిర్బంధాల గోడలను బద్దలు కొడుతూ చిగిరించిన అనురాగాల సమాహారమే 'నీలిగులాబీలు' దళిత ప్రేమ కథా సంకలనం. సాధారణంగా ప్రేమ అనే భావన అత్యంత మధురమైనది. కానీ, ఈ సమాజంలో ఒకరి కులం వారి అస్తిత్వాన్ని నిర్ణయించే చోట, ఆ ప్రేమ కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు... అదొక ఒక నిరంతర ఘర్షణ.

ఈ సంకలనంలో కథలన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. ఈ ప్రేమికులు ఎదుర్కొన్న మానసిక, సామాజిక సంక్షోభాలను రచయితలు అత్యంత హృద్యంగా ఆవిష్కరించారు. పరువు హత్యలు, ప్రేమను ఒప్పుకోలేదని హత్యలు, ఒకే కులం కాదని హత్యలు...ఇలా నిత్యం ఏదో ఒక కారణంతో వార్తల్లో, పేపర్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటిన్నంటికి మూలం ప్రేమ అనే సహజత్వానికి అడ్డొచ్చే కులాల గోడలు, డబ్బుందనే అహం. ప్రేమలో పడిన క్షణాన కనిపించని వ్యత్యాసాలు, సమాజం ముందుకు వచ్చేసరికి ఎంత రాక్షసంగా మారతాయో ఈ కథలు కళ్ళకు కడతాయి. ఎదుటి మనిషిలోని ప్రేమను, గుణాన్ని చూడలేని వ్యవస్థ, వారి రక్తంలో ప్రవహించే కులాన్ని మాత్రమే వెతుక్కునే వైనం పాఠకుడి గుండెలను పిండేస్తుంది.

కులాల గోడలను, సామాజిక ఆంక్షలను ధిక్కరించి ఒక్కటైనంత మాత్రాన ప్రేమ గెలిచినట్లు కాదు అని కొన్ని కథలు వాస్తవిక దృక్పథంతో చూపుతాయి. ఎన్నో పోరాటాల నడుమ పెళ్లి పీటలెక్కిన జంటలు కూడా, కొద్దికాలానికే ఒకరిపై ఒకరికి అనురాగం సన్నగిల్లి విడిపోవడం తీవ్ర బాధాకరం. సమాజాన్ని గెలిచినంత సులువుగా, దైనందిన జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో గెలవలేకపోవడం ‘తప్పెవరిది’’ కథలో స్పష్టంగా కనిపిస్తుంది. ‘‘ప్రేమను నిజంగా ప్రేమిస్తే... ఆ ప్రేమ తిరిగి మనల్ని ప్రేమిస్తుంది’’ అనే సినిమా డైలాగ్ గుర్తు వస్తుంది. నిజమైన ప్రేమ అంటే కేవలం ఆకర్షణో, సమాజంపై తిరుగుబాటో కాదు. ఒకరి లోపాలను, వ్యత్యాసాలను సహనంతో ఆమోదించే మెచ్యురిటీ. పరస్పరం గౌరవించుకోవడం, భావోద్వేగాలను పంచుకోవడం లేనప్పుడు ఆ బంధం క్షీణించిపోతుంది. బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఇద్దరిలోనూ ఆ పరిణతి ఉండాలని, అప్పుడే సమాజాన్ని ఎదురించి గెలిచిన ప్రేమ జీవితాంతం నిలుస్తుందని ఈ కథలు అత్యంత హృద్యంగా స్పష్టం చేస్తున్నాయి.

గులాబీ ప్రేమకు సంకేతం అయితే, 'నీలి' వర్ణం దళిత అస్తిత్వానికి, పోరాటానికి, విస్తృతమైన ఆకాశానికి ప్రతీక. ఈ సంకలనంలోని పాత్రలు కేవలం బాధితులుగా మాత్రమే మిగిలిపోలేదు. తమ ప్రేమ ద్వారా సమాజపు కుళ్ళిన వ్యవస్థను ప్రశ్నించే చైతన్య మూర్తులుగా నిలిచారు. ప్రేమ అనే మధుర భావన వెనుక ఉన్న వేధనను, ఆక్రోశాన్ని, అలాగే ఆ ఆంక్ష‍లను దాటుకుని నిలబడే ఆత్మవిశ్వాసాన్ని వీటిలో కొన్ని కథలు చెబుతాయి. ‘‘నీలిగులాబీలు’’ కేవలం ఒక పుస్తకం కాదు.. ఇది మనుషుల మధ్య ఉండాల్సిన సమత్వాన్ని, అనురాగాన్ని ఆకాంక్షించే ఒక సామాజిక దర్పణం. ప్రేమకు కులం లేదని చాటిచెబుతూనే, కులం పేరుతో ప్రేమను హతమారుస్తున్న సమాజపు మూస ధోరణులను నిలదీస్తుంది ఈ పుస్తకం. సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన, గుండెలకు

హత్తుకునే కథా సంకలనం ఇది.

పద్మావతి

94905 59477

పుస్తకం : నీలిగులాబీలు

పేజీలు : 293, ధర: రూ.295/-

ఫోన్‌: 63053 78160, 88867 66096

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్