- మంత్రి కె.అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న ధరల పతనం సమస్యను భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటుa చేశారని వెల్లడించారు. ఈ కమిటీలో ఐసీఏఆర్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు, రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయ నిపుణులు, రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారులు సభ్యులుగా ఉన్నారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తోతాపురి మామిడి సాగు ప్రాంతాలను సందర్శించి రైతులు, పల్ప్ పరిశ్రమలు, ఎగుమతిదారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రభుత్వ అధికారులతో చర్చించి సమస్యల మూలాలను అధ్యయనం చేసి ఆచరణ సాధ్యమైన సూచనలు అందించనుందని వెల్లడించారు. ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని, అవసరమైన సమాచారం, సమన్వయం కల్పించి త్వరితగతిన నివేదిక సమర్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, ఉద్యాన రంగాన్ని మరింత బలోపేతం చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
పొగాకు గిట్టుబాటు ధరే లక్ష్యం
రాష్ట్రంలో పొగాకు వేలం కేంద్రాలన్నింటినీ పూర్తి స్థాయిలో ప్రారంభించాలని, ప్రతి కొనుగోలు సంస్థ వేలంలో తప్పనిసరిగా పాల్గొనాలని వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఆదేశించారు. వర్జీనియా పొగాకు కొనుగోళ్ల పరిస్థితిపై ఆయన శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా ఎస్‌బీవీ స్వామి, వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వేలానికి దూరంగా ఉండే సంస్థలపై టొబాకో బోర్డు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పొగాకు కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా టొబాకో బోర్డు పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించిన మంత్రి, కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి నాణ్యమైన బేల్స్‌పైనా సీలింగ్ విధించి కృత్రిమంగా ధరలు తగ్గించే ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. అలాంటి చర్యలు నిర్ధారణ అయితే సంబంధిత కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డు అధికారులను ఆదేశించారు.








కామెంట్‌లు (0)