- రోడ్డుపై బైఠాయించి బిజెపి ఎమ్మెల్యే పార్థసారథి హైడ్రామా
- పోలీసుల అడ్డంకులను దాటుకుని పరుగులు
ప్రజాశక్తి- ఆదోని (కర్నూలు జిల్లా)
డిఎస్ సి అవకతవకలకు సమాధానం చెప్తామన్న పేరిట ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వైసిపి కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నించారు. నా వద్ద వివరాలు ఉన్నాయంటూ, అక్కడికి వెళ్లి చెబుతానంటూ అడ్డుపడిన పోలీసులను తప్పించుకుని రోడ్డుపైకి పరుగెత్తి హల్ చల్ చేశారు. అధికార కూటమి ఎమ్మెల్యే చర్యలకు ఆదివారం ఆదోనిలో తీవ్ర ఉద్రిక్తత, హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పార్థసారథి హల్ చల్ హైడ్రామా రక్తి కట్టించిందని చూసిన ప్రజలు అనుకుంటున్నారు.
డిఎస్ సి అంశంపై నేరుగా చర్చించేందుకు సాయంత్రం ఐదు గంటలకు వైసిపి కార్యాలయానికి స్వయంగా వస్తానని ఆదోని బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రకటన చేయడం, సరైన రీతిలోనే మేమూ సమాధానం చెబుతామంటూ వైసిపి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, వైసిపి నాయకుడు చంద్రకాంత్ రెడ్డి నేతృత్వంలో వైసిపి శ్రేణులు వారి కార్యాలయం వద్ద భారీగా గుమిగూడటంతో పరిస్థితి వేడెక్కింది. ఎమ్మెల్యే పార్థసారథి, టిడిపి నాయకుడు సూరం భాస్కర్ రెడ్డిలతో కలిసి భారీగా కూటమి నాయకులు, కార్యకర్తలు వైసిపి ఆఫీసు వైపు బయలుదేరారు. తిరుమల నగర్ ఎమ్మిగనూరు రోడ్డు వద్ద సిఐ నల్లప్ప ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినా పోలీసులను తోసుకుంటూ కూటమి నాయకులు ముందుకు కదిలారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పార్థసారథి సుమారు వంద మీటర్లు రోడ్డుపై పరుగెత్తడం కలకలం రేపింది. వెంటపడిన పోలీసులు ఆయనను అటకాయించడంతో, ఎమ్మెల్యే నాయకులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్ సి నిర్వహణలో లోపాలు జరిగాయని వైసిపి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ నిలదీశారు. వైసిపి కార్యాలయం వద్దకు వందలాది మంది కార్యకర్తలు తరలిరావడంతో సిఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఎమ్మెల్యే తమ కార్యాలయానికే వస్తానని సవాల్ విసిరినందునే తాము సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని వైసిపి నాయకులు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, వైసిపి ఆఫీసు ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పరిస్థితి అదుపులోకి రావడంతో ఆదోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.








కామెంట్‌లు (0)