ప్రజాశక్తి - నంబుల పూలకుంట (శ్రీ సత్యసాయి జిల్లా) : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మండల పరిధిలోని గౌకన్నపేట గ్రామానికి చెందిన రైతు వెంకటేష్ (46)కు 8.50 ఎకరాల భూమి ఉంది. గతంలో మూడు బోరు బావులు తవ్వించారు, రెండు బోర్లలో నీరు పడలేదు. ఒక బోరు ద్వారా వస్తున్న నీటితో తన పొలంలోని 7.50 ఎకరాల్లో వేరుశనగ, ఒక ఎకరా విస్తీర్ణంలో టమోటా పంట సాగు చేశారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల నెల రోజుల నుంచి బోరు బావి నుంచి నీరు రావడం తగ్గుముఖం పట్టింది. దీంతో, వెంకటేష్ తాను సాగు చేసిన పంటకు సకాలంలో నీరందించలేకపోవడంతో వేరుశనగ ఎండు ముఖం పట్టింది. వర్షం వస్తే పంట తిరిగి పుంజుకుంటుందని ఎంతో ఆశతో ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. వెంకటేష్‌కు ఉన్న ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు వికలాంగుడు, తండ్రి రామయ్య అనారోగ్యంతో మంచాన పడ్డారు. పంటల సాగు, కుటుంబపోషణకు ఇప్పటిదాకా దాదాపు రూ.ఆరు లక్షల వరకూ అప్పు చేశారు. ఈ క్రమంలో చేసిన అప్పులు తీర్చే మార్గం లేక, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురైన వెంకటేష్ తన వ్యవసాయ పొలం వద్ద వేప చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.
Farmer: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
02 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 02, 2026, 10:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)