ప్రజాశక్తి-అమరావతి:విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతిపాదించిన గిగా-స్కేల్ ఎఐ డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ప్రాజెక్టు కోసం సారవంతమైన వ్యవసాయ భూములను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ 43 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రిలయన్స్ సంస్థకు 854.97 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఓ నెంబరు 30ను రద్దు చేయాలని కోరుతూ పోలిపల్లి, భోగాపురం ఈస్ట్, భోగాపురం వెస్ట్ గ్రామాలకు చెందిన రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం తేలే వరకు జిఓ అమలుకు సంబంధించిన తదుపరి చర్యలను నిలిపివేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ చల్లా గుణరంజన్ విచారణ చేపట్టి, పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. ఇదే అంశంపై పెండింగ్‌లో ఉన్న ఇతర కేసుల్లో భూ బదలాయింపుపై ముందుకు వెళ్లబోమని ప్రభుత్వం ఇచ్చిన హామీని న్యాయమూర్తి ప్రస్తావిస్తూ, ఈ కేసులోనూ తదుపరి విచారణ సందర్భంగా తగిన ఆదేశాలిస్తామని తెలిపారు.
రైతుల తరపున న్యాయవాది ఎన్ రంగారెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైకోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ ప్రభుత్వం మరో జిఓ జారీ చేసిందన్నారు. రిలయన్స్‌కు కేటాయించిన భూములు బీడు భూములు కాకుండా ఏడాదికి రెండు పంటలు పండే అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములని తెలిపారు. ఈ భూములపైనే దాదాపు 8,500 మంది రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనాధారం ఆధారపడి ఉందని, భూసేకరణ అమలైతే వేలాది కుటుంబాలు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2013 భూ సేకరణ చట్టంలోని సెక్షన్-10 ప్రకారం నీటిపారుదల సౌకర్యం ఉన్న బహుళ పంటల భూములను సేకరించడంపై పరిమితులు ఉన్నాయని గుర్తుచేశారు. అలాగే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సామాజిక ప్రభావ అంచనా (ఎస్‌ఐఎ), ప్రజాభిప్రాయ సేకరణ, నిపుణుల కమిటీ పరిశీలన వంటి తప్పనిసరి ప్రక్రియలను ప్రభుత్వం పాటించలేదని వాదించారు. గ్రామస్తులకు అభ్యంతరాలు తెలియజేసే అవకాశమూ కల్పించలేదని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం కోసం గతంలోనే దాదాపు 950 ఎకరాల భూమిని రైతులు రాష్ర్టాభివృద్ధి కోసం అప్పగించారని, ఆ కష్టాల నుంచి పూర్తిగా కోలుకోకముందే మరోసారి భూములు కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చారని తెలిపారు. ప్రాజెక్టు వల్ల సుమారు 8,500 మంది ప్రభావితమవుతుండగా, కేవలం వెయ్యి మందికి మాత్రమే ఉద్యోగాల హామీ ఇవ్వడం కూడా అన్యాయమేనని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.








కామెంట్‌లు (0)