- వైసిపి జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొంటాయని ఏడాది ముందే హెచ్చరికలు ఉన్నప్పటికీ, కూటమి ప్రభుత్వం కనీస ప్రత్యామ్నాయ ప్రణాళిక (కంటింజెన్సీ ప్లాన్) రూపొందించకుండా రైతాంగాన్ని గాలికొదిలేసిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సంకుచిత మనస్తత్వం, వ్యక్తిగత కక్షతో రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీశైలంలో సరిపడా నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయకుండా నామమాత్రపు నీటితో సరిపెడుతూ గండికోట, గోరకల్లు, వెలుగోడు, సోమశిల, కండలేరు వంటి కీలక రిజర్వాయర్లను ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసి కెనాల్‌కు సైతం నీరందకుండా చేసి రైతుల పొట్ట కొడుతున్నారని, రాయలసీమ ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వం చూపుతున్న తీవ్ర వివక్ష వల్ల కరువు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ప్రభుత్వం మొద్దునిద్ర వీడి రైతులకు కంటింజెన్సీ ప్లాన్ ద్వారా అండగా నిలవాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీశైలానికి నీళ్లు వచ్చినా, పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయకుండా చంద్రబాబు రాయలసీమ ప్రజలపై తన కక్షను తీర్చుకుంటున్నారని తెలిపారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 50 వేల క్యూసెక్కులు ఉంటే, ఎనిమిది వేల క్యూసెక్కులు విడుదల చేస్తూ రిజర్వాయర్లను ఎండబెడుతున్నారని అన్నారు. ప్రధాన రిజర్వాయర్లలో నీరు లేకపోయినా వాటిని నింపే ఆలోచన చేయడం లేదని తెలిపారు. గండికోట లాంటి కీలకమైన జంక్షన్ డ్యామ్‌ను, అనుసంధాన ప్రాజెక్టులను పూర్తి చేయకుండా మూలన పడేశారని, తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలిస్తుంటే, మన దగ్గర అవకాశాలున్నా కనీసం రిజర్వాయర్లను నింపుకునే ప్రయత్నం చేయడం లేదని వివరించారు. బోర్లు కింద కొద్దోగొప్పో పంటలు వేసుకుందామన్న రైతులకు యూరియా దొరకడం లేదని, విత్తనాల సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు.
డైవర్షన్ కోసమే మరోసారి తెరపైకి వివేకా హత్య కేసు
డీఎస్సీ అక్రమాలు, పోలీసులు ప్రయాణిస్తున్న కారులో గంజాయి దొరికిన ఘటన, సుగాలి ప్రీతి తల్లి వీల్‌చైర్ యాత్రను అడ్డుకోవడం, అధికార పార్టీ ఎంపీ కుమారుడు కారు నడుపుతూ యువతిని ఢీకొట్టి చంపిన ఘటన వంటి దారుణమైన అంశాలపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వివేకా హత్య కేసును మరోసారి తెరపైకి తెచ్చారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆ దిశలోనే తొలిసారి ఈడీని రంగ ప్రవేశం చేయించి, వైయస్సార్‌సిపి ఎంపి అవినాష్ రెడ్డి ఇంట్లో సోదాలు చేయిస్తున్నారని తెలిపారు. దాని వల్ల ఏదో విజయం సాధించినట్లు ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.








కామెంట్‌లు (0)