రాష్ట్రంలో నాలుగుకు*చేరిన మృతుల సంఖ్య
ర్యాపిడ్ టెస్ట్ కిట్లు సిద్దం చేయండి : సిఎం ఆదేశం
ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. కొద్దిరోజులుగా కేసుల సంఖ్యతో పాటు, మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందగా తాజాగా మరో ఇద్దరు మరణించారు దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాండియన్ గురువారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం కడప,కాకినాడ జిల్లాలో ఒకొక్కరు తాజాగా మృతి చెందారు. దీంతో ఒక్క కడప జిల్లాలోనే మొత్తం మరణాల సంఖ్య మూడుకు చేరింది. గురువారం సాయంత్రానికి రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 12కు చేరింది. అత్యధికంగా కడప జిల్లాలోనే 8 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. గుంటూరులో రెండు, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున వెలుగుచూశాయి. జూన్ 26వ తేదిన కడప జిల్లాలో తొలి కేసు నమోదుకాగా, ఈ నెల 1వ తేది నుంచి 16వ తేది సాయంత్రం వరకు 11 కేసులు బయటపడ్డాయి. మొత్తం 67 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వైరస్ జన్యు స్వరూపాన్ని గుర్తించేందుకు ఐదు నమూనాలను 9వ తేదిన పుణెలోని జాతీయ వైరాలజి సంస్థకు విశ్లేషణ కోసం పంపించినట్లు వైద్యు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రజల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్తలు పాటించాలని, వైద్యులు, ఆసుపత్రులు సిబ్బందిని అప్రమత్తం చేశామని పేర్కొంది. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో ఒక వృద్ధుడు కరోనాతో బుధవారం మృతి చెందాడు. శ్వాసకోశ సమస్యలు, న్యుమోనియా, మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వైఎస్ఆర్ జిల్లాకు చెందిన 66 ఏళ్ల వ్యక్తికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కోవిడ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. ఆయన తొలుత కడపలోని రిమ్స్‌లోనూ, ఆ తర్వాత తిరుపతిలోని స్విమ్స్ లోనూ, ఆపై ఒక ప్రైవేట్ ఆస్ప్రతిలోనూ చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో బుధవారం మరణించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆస్పత్రికి కోవిడ్ లక్షణాలతో పలువురు రోగులు వస్తున్నారు. గురువారం ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. విశాఖ కెజిహెచ్ లోనూ కరోనా కేసు గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
మంగళగిరి ఎయిమ్స్‌లోనే 20 మందికి ...?
రాష్ట్ర ప్రభుత్వం 12 మందికే ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకినట్లు ప్రకటించగా, మంగళగిరి ఎయిమ్స్‌లోనే 20 మందికి ఈ వ్యాధి నిర్ధారణ అయినట్లు సమాచారం. కోవిడ్ తీవ్రత పెరగడంతో ఎయిమ్స్‌లో ప్రత్యేక ఫీవర్ వార్డు సిద్ధం చేశారు. కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న 16 మందికి చికిత్స అందిస్తున్నారు. గురువారం వచ్చిన ఇద్దరినీ ఇంటి వద్ద ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించి పంపేశారు. ఏ ప్రాంతం నుంచి ఎక్కువ మంది వస్తున్నారనే విషయాలను అధికారులు గోప్యంగా ఉంచారు. కరోనా బాధితులంతా స్థానికేతరులేనని వారు తెలిపారు. మంగళగిరి ప్రాంతానికి చెందిన వారు ఎవ్వరూ లేరని చెప్పారు. ఎయిమ్స్‌లో సిబ్బంది, అధికారులు మొత్తం మాస్క్‌లు ధరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. విశాఖలో అఫీషియల్ కాలనీలో ఉంటున్న 33 ఏళ్ల యువకుడు కెజిహెచ్ జనరల్ ఫిజీషియన్ ను వైద్యం నిమిత్తం కలిశారు. కోవిడ్ లక్షణాలు ఉండటంతో నగరంలోని ప్రైవేట్ టెస్ట్ కు పంపారు. అక్కడ నిర్వహించిన పరీక్షలో కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో, బుధవారం అర్ధరాత్రి నుంచి ఆ యువకుడిని హోం ఐసోలేషన్‌లో ఉంచి ఆరోగ్యశాఖాధికారులు పర్యవేక్షిస్తున్నారు. కడపలో మరో ఆరుగురికి కరోనా నిర్థారణ కాగా, కడప జిజిహెచ్ వైద్య నిపుణులు వారి రక్త నమూనాలను పూణేలోని వైరల్ ల్యాబ్ పంపించారు.
దేశంలో ఇలా...
దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి ఇప్పటివరకు 339 కోవిడ్ కేసులు రికార్డ్ అయ్యాయి. కేరళలో 115, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్‌లో 18, ఢిల్లీలో 18, రాజస్థాన్లో 12, ఇతర రాష్ట్రాల్లో మరికొన్ని కేసులు నమోదు అయ్యాయి.







కామెంట్‌లు (0)