సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రయోగానికి సిద్ధమైన తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1'

2 గంటల క్రితం

vikram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 07:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-సూళ్లూరుపేట రూరల్: భారత్ అంతరిక్ష స్వావలంబన దిశగా మరో చారిత్రక అధ్యాయానికి తెరలేవనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అందిస్తున్న ప్రోత్సాహం, స్వదేశీ ప్రైవేట్ సంస్థల సాంకేతిక సామర్థ్యం కలయికతో దేశ అంతరిక్ష రంగం కొత్త శకంలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్, దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1'ను జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్య ప్రయోగించనున్నట్లు ప్రకటించింది. 2022లో ఇస్రో ప్రయోగ వేదిక నుంచే భారత తొలి ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-ఎస్'ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపిన స్కైరూట్, ఇప్పుడు 350 కిలోల వరకు బరువున్న చిన్న ఉపగ్రహాలను భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యంతో రూపొందించిన విక్రమ్-1 ద్వారా మరో కీలక మైలురాయిని చేరుకోనుంది. పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణం, ఘన, ద్రవ చోదక వ్యవస్థలు, అత్యాధునిక 3డీ ప్రింటెడ్ ఇంజిన్లతో రూపొందిన ఈ రాకెట్ తొలి ప్రయోగం ద్వారా, ప్రయోగం ప్రారంభం నుంచి కక్ష్య చేరే వరకు ప్రతి దశలో రాకెట్పనితీరుకు సంబంధించిన కీలక సాంకేతిక సమాచారాన్ని సేకరించనున్నారు. స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందానా మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాలు, ఇస్రో అందిస్తున్న సహకారం, అమెరికాలో నాసా-స్పేస్ఎక్స్ భాగస్వామ్యాన్ని తలపిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టే అంతరిక్ష కేంద్రాలు, ఉపగ్రహాలు, కొత్త రాకెట్ల అభివృద్ధిలో ప్రైవేట్ స్టార్టప్లను భాగస్వాములుగా చేర్చడం ద్వారా దేశ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. ప్రస్తుతం సుమారు 8.4 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ, 2033 నాటికి 44 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాల మధ్య, 'మిషన్ ఆగమన్' పేరుతో చేపట్టనున్న ఈ ప్రయోగం విజయవంతమైతే, ఒకటి లేదా రెండు ప్రదర్శన ప్రయోగాల అనంతరం పూర్తిస్థాయి వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలను ప్రారంభించేందుకు స్కైరూట్ సిద్ధమవుతోంది. ప్రపంచంలో ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపగల కొద్ది ప్రైవేట్ సంస్థల సరసన భారత సంస్థగా స్కైరూట్ నిలిచే అవకాశాన్ని ఈ ప్రయోగం కల్పించడమే కాకుండా, ప్రపంచ అంతరిక్ష రంగంలో భారత్ కు మరింత ప్రతిష్ఠను తీసుకురానుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్