ఆందోళనలో కుటుంబ సభ్యులు
ప్రజాశక్తి - అమలాపురం (డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా) : డాక్టర్ బి.ఆర్..అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి ఈ నెల 3న చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారు ఈ నెల 13వ తేదీకి రావాల్సి ఉండగా, ఐదు రోజులైనా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బోటు యజమాని కొపనాతి రామకృష్ణవర్మతో పాటు సంగాడి తాతారావు, కొల్లాటి ఏసుదాసు, పాలెపు శాంతారావు, కర్రి రాముడు, కాటాడి సతీష్, కొల్లాటి శ్రీనుబాబు ఈ బోటులో ఉన్నారు. సముద్రంలో చేపటల వేటకు వెళ్లే బోట్లకు ట్రాన్స్ ఫౌండర్ అనే పరికరాన్ని మత్స్యశాఖ ఆధ్వర్యంలో అమరుస్తున్నారు. ఓడలరేవు ప్రాంతంలో ఉన్న 64 బోట్లకు ఈ నెల ఆరో తేదీ నుంచి ఈ అమరిక ప్రక్రియను ఫిషరీస్ శాఖ అధికారులు ప్రారంభించారు. ఆ బోటు మూడో తేదీనే సముద్రంలోకి వెళ్లిపోవడంతో దానికి అమర్చలేదు. ఈ పరికరం ఉంటే అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా బోటు ఉన్న నిర్దిష్ట ప్రదేశాన్ని కనుగొనే వీలుంటుందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం, పారాదీప్ పోర్టుల వైపునకు బోటు వెళ్లి ఉండొచ్చని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆ దిశగా గాలిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
గ్రామంలో విషాదఛాయలు...
వారి ఆచూకీ లేకపోవడంతో మత్స్యకార కుటుంబాల్లోనూ, ఓడరేవులోనూ విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారులెవరైనా వస్తే తమ వారి ఆచూకీ కోసం ఆత్రుతగా పరుగులు తీస్తున్నారు. ‘కుటుంబానికి నువ్వే పెద్ద దిక్కు త్వరాగా రా అయ్యా’ అంటూ శాంతారావు తల్లి, భార్య, కుమార్తె రోదిస్తున్నారు. కొల్లాటి శ్రీనుబాబు కోసం అతని భార్య, పిల్లలు రోదిస్తున్న తీరు అందరినీ కంట తడిపెట్టిస్తోంది. గల్లంతైన వారి ఇళ్లకు ఇప్పటికే బంధువులు చేరుకుని బాధితులకు తోడుగా ఉన్నారు.







కామెంట్‌లు (0)