అమరావతి : ఎపి మంత్రి లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా .... ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాదరక్షలు, వాటి అనుబంధ పరికరాల తయారీ సంస్థ 'బూ యంగ్ గ్రూప్' (Boo Young Group) యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించాయి. ఎపి రాష్ట్రంలో తయారీ యూనిట్ ఏర్పాటుకు బూ యంగ్ గ్రూప్ సానుకూలత వ్యక్తం చేసింది.
బుసాన్‌లో బూ యంగ్ గ్రూప్ సీఈవో, ప్రెసిడెంట్ ర్యాన్ కాంగ్‌తో మంత్రి లోకేష్ బుధవారం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పాదరక్షలు, విడిభాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని లోకేష్ సదరు కంపెనీని ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని లోకేష్ తెలిపారు. సింగిల్ విండో విధానంలో పరిశ్రమకు కావాల్సిన అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేస్తామని భరోసానిచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన పారిశ్రామిక జోన్లలో కంపెనీ ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ కనెక్టివిటీ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై బూ యంగ్ గ్రూప్ సీఈవో ర్యాన్ కాంగ్ సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ యూనిట్ ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే, కార్యకలాపాలను వెంటనే ప్రారంభించేందుకు వీలుగా 'రెడీ బిల్ట్ షెడ్ల' కోసం అన్వేషిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తమ సంస్థ స్కైకార్ప్ గ్రూప్‌లో భాగమని, ప్రపంచవ్యాప్తంగా 4,300 మంది కస్టమర్లు, 1.10 లక్షలకు పైగా అంతర్జాతీయ షిప్‌మెంట్లు నిర్వహించేంత పెద్ద నెట్‌వర్క్ తమకు ఉందని వివరించారు. తమకున్న గ్లోబల్ నెట్‌వర్క్ ద్వారా భారతీయ తయారీ రంగాన్ని ప్రపంచ పంపిణీ వ్యవస్థతో సులభంగా అనుసంధానించవచ్చని ఆయన తెలిపారు. ఈ సమావేశం విజయవంతం కావడంతో బూ యంగ్ గ్రూప్ ప్రతినిధులు త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి, రెడీ బిల్ట్ షెడ్ల లభ్యతను పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.








కామెంట్‌లు (0)