- మంత్రులు డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి, ఎస్.సవిత
- రాష్ట్ర సచివాలయంలో లిడ్ క్యాప్ ఔట్ లెట్ ను ప్రారంభించిన మంత్రులు
అమరావతి : కుల వృత్తుదారులకు ఆర్థిక భరోసా కల్పించేలా ఆధునిక పరికరాలను కూటమి ప్రభుత్వం అందజేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖమాత్యులు ఎస్.సవిత తెలిపారు. చర్మకారుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక దృష్టి సారించామని వారు పేర్కొన్నారు. ఎపి సచివాలయంలోని నాల్గవ భవనంలో లిడ్ క్యాప్ లెదర్ షోరూమ్(ఔట్ లెట్)ను మంత్రులు ఇరువురు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడుతూ లిడ్ క్యాప్ ద్వారా చర్మకారుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బాల వీరాంజనేయస్వామి తెలిపారు. చర్మకారులకు ఉపాధి కల్పనకు మార్కాపురం జిల్లా యడవల్లి, కృష్ణాజిల్లా జి.కొండూరులో లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లిడ్ క్యాప్ కి పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్నారు.
రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత మాట్లాడుతూ కుల వృత్తిదారులకు ఏడాది పాటు ఉపాధి కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. శాశ్వత ఉపాధితో పాటు ఆర్థిక భరోసా కలిగేలా కుల వృత్తిదారులకు ఆధునిక పరికరాలు అందజేస్తున్నామన్నారు. సచివాలయంలో లిడ్ క్యాప్ అవుట్ లెట్ ఏర్పాటుతో నాణ్యమైన వివిధ రకాల లెదర్ ఉత్పత్తులు సచివాలయ ఉద్యోగులకు, సందర్శకులకు లభించే అవకాశం కలిగిందన్నారు. పది శాతం డిస్కౌంట్లపై సచివాలయ సిబ్బంది లెదర్ ఉత్పత్తులు విక్రయిస్తారన్నారు.
లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ చర్మకారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వ కబ్జా కోరుల నుంచి లిడ్ క్యాప్ సంస్థ భూముల్ని కాపాడామన్నారు. లిడ్ క్యాప్ ద్వారా మంచి నాణ్యత కలిగిన వివిధ రకాల తోలు ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నామన్నారు.
లెదర్ ఉత్పత్తులను స్వయంగా కొనుగోలు చేసిన మంత్రులు
సచివాలయంలో లిడ్ క్యాప్ అవుట్ లెట్ ప్రారంభం సందర్భంగా మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, సవిత లెదర్ ఉత్పత్తులు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎంఎం నాయక్,లిడ్ క్యాప్ ఎండీ ప్రసన్న వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)