సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతుల భూములను బలవంతంగా తీసుకోవటం అన్యాయం, అక్రమం : సిహెచ్.బాబూరావు

1 గంట క్రితం

Forcibly acquiring farmers' lands is unjust and illegal: Ch. Babu Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 02:49 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

భూములు కోల్పోతున్న రైతుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించవా ?

రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందాలి, రైతులకు న్యాయం చేయాలి

చిగురుపాటి బాబురావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

భూములు కోల్పోతున్న రైతుల పంట పొలాలను పరిశీలించిన సిపిఎం నాయకులు.


ఉండవల్లి (గుంటూరు) : రాజధాని ఉండవల్లి ప్రాంతంలో రైతులతో సంప్రదింపులు జరపకుండా, రైతుల వద్ద నుండి బలవంతపు భూసేకరణ చేయటం అన్యాయం, అక్రమమని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు అన్నారు. రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో సోమవారం సిపిఎం నాయకులతో కలిసి, సి ఆర్ డి ఏ, ప్రభుత్వం ఉండవల్లి రైతుల బలవంతపు భూసేకరణ చేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉండవల్లి రాజధాని సిపిఎం కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబురావు మాట్లాడుతూ సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం రైతుల భూములు తీసుకునేందుకు, దౌర్జన్యంగా బుల్డోజర్లతో రైతుల భూములను బలవంతంగా తీసుకున్నారని ఆయన విమర్శించారు. చట్టాలను లెక్కచేయకుండా, కోర్టులో వివాదం ఉండగా, కోర్టు తీర్పులు పట్టించుకోకుండా దౌర్జన్యంగా రైతుల పంట భూములు తీసుకోవటాన్ని సిపిఎం వ్యతిరేకిస్తుందని అన్నారు. మహిళలని చూడకుండా, విచక్షణ రహితంగా మహిళలను జుట్టు పట్టుకొని లాగివేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. భూములు కోల్పోతున్న రైతుల ఆర్తనాదాలు వినకుండా, ప్రభుత్వం భూములు లాక్కోవడం అన్యాయం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధానిగా ఉండాలని రైతులే స్వయంగా ఉద్యమం చేస్తే, రైతులకు మద్దతు ఇచ్చిన కూటమి ప్రభుత్వం నేడు పేద రైతుల వద్ద నుండి దౌర్జన్యం చేసి, భూములు లాక్కోవడం అన్యాయం కాదా? అని విమర్శించారు. రాజధాని సమస్యను, భూముల సమస్యను జటిలం చేస్తున్నది సి ఆర్ డి ఏ, ప్రభుత్వమేనని బాబురావు ధ్వజమెత్తారు. రైతులతో సంప్రదింపులు జరిపి, ప్రస్తుత మార్కెట్ ధరను దృష్టిలో పెట్టుకొని, భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.ఎకరం ఆరు, ఏడు కోట్ల విలువచేసే భూములను 73 లక్షల నుండి కోటి 20 లక్షలు అంటూ, రిజిస్ట్రేషన్ వేల్యూ తెలియకుండా ఆర్డర్ ప్రకటించటం దుర్మార్గమన్నారు. 12 సంవత్సరాల క్రితం 50 వేల ఎకరాల భూములు తీసుకున్న వాటికి ఫ్లాట్స్ కేటాయించడానికి, అభివృద్ధి చేయడానికి సమయం చాల లేదా అని ఎద్దేవా చేశారు. రైతులు సీడ్ ఆక్సిస్ రోడ్డుకి వ్యతిరేకం కాదని అన్నారు. మంత్రి నారాయణతో సహా సీఆర్డీఏ అధికారులు రైతులను భూములు ఇవ్వాలని, సీడ్ ఆక్సిస్ రోడ్డుకి పోగా మిగిలింది వదిలేస్తామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. ప్రత్యామ్నాయంగా ఆరు నెలల్లో ప్లాట్లు వేసి అభివృద్ధి చేస్తామని అన్నారని చెప్పారు. భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నామంటూ, 9.3 పత్రాలతో అంగీకారం తెలిపినా, రైతుల భూములలో దౌర్జన్యంగా మట్టి వేశారని అన్నారు. మాట తప్పింది ప్రభుత్వమేనని, రైతులు కాదన్నారు. రాజధాని భూముల విషయంలో అన్యాయం జరుగుతున్నా, స్థానిక శాసన సభ్యులుగా ఉన్న నారా లోకేష్ నోరు మెదపడం లేదని విమర్శించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం వస్తే రైతులపై కేసులు ఎత్తివేస్తామని, రైతులకు న్యాయం చేస్తామని చెప్పారని అన్నారు. రైతులకు చేసే న్యాయం ఇదేనా? అని బాబురావు ప్రశ్నించారు. కొరియా, రష్యా, సింగపూర్ వంటి పెట్టుబడిదారులతో మాట్లాడే మంత్రి నారా లోకేష్ కు రైతులతో మాట్లాడే తీరిక లేదా అన్నారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో రైతుల భూములు బలవంతంగా తీసుకుంటే జనసేన చూస్తూ ఊరుకోదని చెప్పిన పవన్ కళ్యాణ్, జనసేన నేతలు పేదల భూములు లాక్కుంటుంటే ఎందుకు మాట్లాడరని సిపిఎం ప్రశ్నిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూ దాహం పట్టుకుందని అన్నారు. రెండవ దశ 43 గ్రామాలలో 1,43,000 ఎకరాలు భూ సేకరణ చేస్తామని అనడం దుర్మార్గమన్నారు. రాజధాని అంటే పారిశ్రామికవేత్తలకి, కాంట్రాక్టర్లకి, నాయకుల కేనా? రైతుల గోడు పట్టదా అని దుయ్యబట్టారు. తక్షణమే భూములు కోల్పోతున్న పేద రైతులకు న్యాయం చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఆరు, ఏడు కోట్ల రూపాయల విలువ గల భూములను సగానికి పైగా విలువను తగ్గించేసి, రైతుల వద్ద దౌర్జన్యంగా భూములు లాక్కోవడం సిపిఎం ఖండిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు జొన్న శివశంకరరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైతులతో సంప్రదింపులు జరపకుండా, సి ఆర్ డి ఏ అధికారులు 200 మంది పోలీసుల బలగాలతో, బుల్డోజర్లతో పేద రైతుల భూములు లాక్కునేందుకు పూనుకోవటం దుర్మార్గమైన చర్య అని అన్నారు. రైతులతో సంప్రదింపులు జరపకుండా, అంగీకారం లేకుండా నిరంకుశంగా సి ఆర్ డి ఏ, ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి, సిపిఎం రాజధాని నాయకులు కొర్రపోలు ఈశ్వరరెడ్డి, ఎస్.కె ఎర్ర ఫీర్, టి బక్కి రెడ్డి, కే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్