ప్రభుత్వ విద్య పరిరక్షణే దేశ భవిష్యత్తు
విద్యార్థుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేస్తాం
వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విధానాలపై పోరాటం
ప్రజాశక్తి-విశాఖపట్నం బ్యూరో : స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) అఖిల భారత కమిటీ మూడు రోజుల సమావేశాలు సోమవారం విశాఖపట్నంలో ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ముందు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వేమన మందిరం నుంచి సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రం వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్రజెండాలు, నినాదాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో సాగిన ర్యాలీ నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం గురజాడ కళాక్షేత్రంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకుడు అజయ్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత, రాష్ట్ర నాయకులు ప్రసంగించారు.

ప్రభుత్వ విద్యా పరిరక్షణ, విద్యార్థుల హక్కుల రక్షణ, జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, ఉపాధ్యాయ నియామకాలు, పరీక్షల్లో అవకతవకలు, ప్రభుత్వ పాఠశాలల మూసివేత, విద్యారంగ ప్రైవేటీకరణ, తదితర అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా విమర్శించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఐక్యమై ప్రజాస్వామ్య ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ విద్య తీవ్ర సంక్షోభంలో ఉంది : సృజన్ భట్టాచార్య
ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సృజన్ భట్టాచార్య మాట్లాడుతూ .... విశాఖలో నిర్వహించిన భారీ విద్యార్థుల ర్యాలీ దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి, కార్యకర్తలందరికీ ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కార్యవర్గం తరపున విప్లవ అభినందనలు తెలిపారు. దేశంలో ప్రభుత్వ విద్య తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని, ఉపాధ్యాయ నియామకాలు నిలిచిపోయాయని, విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గుతున్నాయని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం, స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లకు నిధులు తగ్గించడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీక్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వైఫల్యాలు, యూజీసీ-నెట్, సీయూఈటీ, సీబీఎస్‌ఈ మూల్యాంకన వ్యవస్థల్లో లోపాలు దేశ విద్యా వ్యవస్థ సంక్షోభాన్ని బహిర్గతం చేస్తున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో టెట్ ప్రశ్నపత్రం లీక్, పశ్చిమ బెంగాల్‌లో ఐటీఐల ప్రైవేటీకరణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉపాధ్యాయ నియామకాల సమస్యలు, అసోంలో ఉన్నత విద్యకు నిధుల కొరత దేశవ్యాప్తంగా విద్యారంగ దుస్థితికి నిదర్శనాలని అన్నారు. విద్యను ప్రైవేటీకరణ నుంచి కాపాడాలని, విద్యా ఫీజులను తగ్గించాలని, స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు పెంచాలని, భారీ స్థాయిలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మతం, కులం, భాష పేరుతో దేశాన్ని విభజించే శక్తులను విద్యార్థులు ప్రతిఘటించాలని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం : ఆదర్శ్ ఎం. సాజీ
ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు ఆదర్శ్ ఎం. సాజీ మాట్లాడుతూ .... దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యను బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల వల్ల 22 లక్షల మందికిపైగా విద్యార్థులు, సీబీఎస్‌ఈ మూల్యాంకనలో లోపాల వల్ల మరో 16 లక్షల మంది విద్యార్థులు నష్టపోయారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. గత పదకొండు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 1.20 లక్షలకుపైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడటం తీవ్ర ఆందోళనకరమన్నారు. ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం పోరాడుతున్న విద్యార్థులపై అరెస్టులు, లాఠీచార్జీలు, నిర్బంధ చర్యలను ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలుగా ఖండించారు. బీహార్‌లో ఉన్నత విద్య కోసం పోరాడిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను జైలుకు పంపడాన్ని తీవ్రంగా నిరసిస్తూ .... ఎలాంటి నిర్బంధాలకూ భయపడకుండా ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కార్పొరేటీకరణను అడ్డుకుంటాం : ఐషే ఘోష్
ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి ఐషే ఘోష్ మాట్లాడుతూ .... విద్యను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రతి ప్రయత్నాన్ని ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని అన్నారు. కేంద్రంలోని బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ కలిసి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై భావజాలపరమైన దాడులు చేస్తోందని ఆరోపించారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో విద్యాసంస్థల వ్యవహారాల్లో గవర్నర్ల జోక్యం పెరుగుతున్నదని ఆరోపించారు. విద్యార్థి నాయకులపై కేసులు పెట్టడం, జైలుకు పంపడం ద్వారా ఉద్యమాలను అణచివేయలేరన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏకలవ్య పాఠశాలల్లో నిధుల కొరత, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాల లేమిని స్వయంగా పరిశీలించామని, గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలకు ఎస్‌ఎఫ్‌ఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు.
జి.ఓ. 77ను వెంటనే ఉపసంహరించాలి : కె. ప్రసన్న కుమార్
ఎస్‌ఎఫ్‌ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .... రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జి.ఓ. నెం.77ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పుగా మారిందన్నారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖలో ప్రతిపాదిత గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు పేరుతో కొండలు, అడవులు, సహజ వనరులను ధ్వంసం చేసే ప్రయత్నాలను విద్యార్థి, యువత ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని డిమాండ్ చేస్తూ కార్మిక ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
రూ.7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు : టి. నాగరాజు
ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ .... తెలంగాణలో దాదాపు రూ.7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో వేలాదిమంది విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేకపోతున్నారని అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని, కొత్త ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, మూసివేసిన పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

'చదువు–పోరాడు' నినాదంతో నిరంతర ఉద్యమం : పి. రాంమోహన్ రావు
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రాంమోహన్ రావు మాట్లాడుతూ .... 'చదువు–పోరాడు' నినాదంతో విద్యార్థుల విద్యా హక్కుల కోసం ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాడుతోందన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్, జాతీయ విద్యా విధానం-2020, ప్రభుత్వ విద్య పరిరక్షణ వంటి అంశాలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ అని పేర్కొన్నారు. చదువుతో పాటు హక్కుల కోసం కూడా ప్రతి విద్యార్థి పోరాడాలని పిలుపునిచ్చారు.
బాలికల సమస్యలు పరిష్కరించాలి : మౌనిక
ఎస్‌ఎఫ్‌ఐ విశాఖ జిల్లా బాలికల కన్వీనర్ మౌనిక సంక్షేమ హాస్టళ్లలో మెస్ ఛార్జీలు పెంచాలని, బాలికలకు ఉచిత శానిటరీ ప్యాడ్లు, ప్రత్యేక రుతుక్రమ సెలవులు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళలపై పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జి.ఓ. నెం.77 వల్ల పీజీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, దానిని వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్త కార్యాచరణకు రూపకల్పన : ఎస్ఎఫ్ఐ నాయకులు
మూడు రోజులపాటు జరిగే జాతీయ కమిటీ సమావేశాల్లో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్ దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమాల కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు నాయకులు తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, ప్రైవేటీకరణను అడ్డుకోవడం, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం, పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడం, ప్రతి విద్యార్థికి నాణ్యమైన ప్రభుత్వ విద్యను అందించడం ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కులు, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులను సంఘటితం చేసి విస్తృత ఉద్యమాలు చేపడతామని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రకటించారు.







కామెంట్‌లు (0)