సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

బిజెపి నుండి ‘లీగల్‌ నోటీసు’ల రూపంలో ‘లవ్‌ లెటర్‌’ : ఒమర్‌ అబ్దుల్లా

1 గంట క్రితం

omar abdullah
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 03:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీనగర్‌ : బిజెపి నుండి లీగల్‌ నోటీసుల రూపంలో లవ్‌ లెటర్‌ అందిందని, ఈ నోటీసులను తీసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని జమ్ముకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. తాము విస్మరించలేని రాజకీయ శక్తి అని ఈ నోటీసు రుజువుచేస్తోందని అన్నారు. సోమవారం ఆయన శ్రీనగర్‌లోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బిజెపి తమ పార్టీ ఎమ్మెల్యేలకు డబ్బు, మంత్రి పదవులను ఇస్తానని ఆశచూపి తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్రపన్నిందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై జమ్ముకాశ్మీర్‌ బిజెపి యూనిట్‌ సోమవారం నోటీసులు జారీ చేసింది. తాను లాయర్ నుండి ఎలక్ట్రానిక్‌ కాపీని అందుకున్నానని, బిజెపి నుండి లవ్‌ లెటర్‌ అందుకున్న ఏకైక నేతగా తాను చాలా గర్వంగా భావిస్తున్నానని అన్నారు. జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌సి విస్మరించలేని రాజకీయ శక్తిగా బిజెపి గుర్తిస్తోందని ఈ నోటీసు రుజువుచేసిందని అన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఆరోపణలను రుజువుచేయకపోతే.. బహిరంగ క్ష‍మాపణ చెప్పకపోతే, రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తామని బిజెపి నోటీసుల్లో పేర్కొందని అన్నారు. తన వ్యాఖ్యలపై రాజకీయ ప్రతిస్పందన ఉంటుందని భావించానని, కానీ బిజెపి చట్టపరమైన మార్గాన్ని ఎంచుకుందని అన్నారు. బిజెపి పోరాడే తీరుకు ఇది నిదర్శమని, రాజకీయ పోరాటాలు చేస్తూనే కోర్టుల చాటున దాక్కుంటారని ఎద్దేవా చేశారు. తాను కూడా అసెంబ్లీ వేదికగా ఈ వ్యాఖ్యలు చేసి దాక్కోవచ్చని, అసెంబ్లీ కల్పించే ప్రత్యేక హక్కులను తాను ఉపయోగించుకోవచ్చని , కానీ తాను భయపడనని అన్నారు. గత కొంత కాలంగా పలువురు బిజెపి నేతలు తన పార్టీపై అలాగే దాని నాయకత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అయితే తాము రాజకీయంగానే ఎదుర్కోవాలని గతంలో నిర్ణయించుకున్నామని అన్నారు. ప్రస్తుతం బిజెపి నేతలపై చట్టబద్ధంగా పోరాడతామని, అవసరమైన చర్యలు చేపడతామని అన్నారు.








ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్