- 27న విజయవాడలో ‘మీట్ జెన్‌జీ’
- ఐషీ ఘోష్‌తో విద్యార్థుల ముఖాముఖి
- అసెంబ్లీ సాక్షిగా లోకేష్ అబద్ధాలు
- ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జెన్‌జీ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ నాయకురాలు, జెఎన్‌యు విద్యార్థి సంఘం పూర్వ అధ్యక్షురాలు ఐషి ఘోష్‌తో ఈ నెల 27న విజయవాడలో ‘మీట్ జెన్‌జీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. శుక్రవారం ఎంబివికెలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ‘జెన్‌జీ ఇకపై నిశ్శబ్దంగా ఉండదు’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతర్‌మంతర్ ఉద్యమం స్ఫూర్తితో దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ సమస్యలపై రోడ్లపైకి వస్తున్నారని అన్నారు. జంతర్‌మంతర్ ఉద్యమంలో ఎదురైన అనుభవాలను ఐషీ ఘోష్ ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పంచుకుంటారని తెలిపారు. విద్యార్థుల ఉద్యమాలపై కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిర్బంధం విధించిన తీరును దేశం చూసిందన్నారు. విద్యార్థుల సమస్యలపై భవిష్యత్ పోరాటాలకు ఈ కార్యక్రమం దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.విద్యారంగానికి సంబంధించి అసెంబ్లీ సాక్షిగా మంత్రి లోకేష్ అబద్ధాలు చెప్పడం సరికాదని విమర్శించారు. రాష్ట్రంలో పాఠశాలలు మూసివేయలేదని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చెబుతున్నారని, మరోవైపు ఓ విద్యార్థి పాఠశాల మూసివేశారంటూ చేసిన ట్వీట్‌ను లోకేష్ రీట్వీట్ చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో 972 పాఠశాలలను మూసివేసినట్లు నీతి ఆయోగ్ పేర్కొంటున్న నేపథ్యంలో.. నీతి ఆయోగ్ చెప్పేది నిజమా? లోకేష్ మాట్లాడేది నిజమా? అని ప్రశ్నించారు.రాష్ట్రంలోని సుమారు 7 వేల పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కొరవడినట్లు ఆయన తెలిపారు. సాలూరులో ప్రభుత్వ పాఠశాల గోడ కూలి విద్యార్థి మృతి చెందడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ‘తల్లికి వందనం’ పేరుతో విద్యార్థుల కుటుంబాల నుంచి రూ.2,000 తీసుకుంటున్న ప్రభుత్వం, ఆ నిధులను పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేసి ఉంటే సాలూరు ఘటనలో విద్యార్థి ప్రాణాలు కోల్పోయేవాడు కాదన్నారు.ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిల విడుదల, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 27న జరిగే సభలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి రవి, ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్షుడు షణ్ముక్, కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు ప్రణీత పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)