గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅమెరికా పర్యటనకు జిన్‌ పింగ్‌

42 నిమిషాల క్రితం

img_a123f11b27fb45b4ac9df23894539ff8115420.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 07:17 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • స్యయంగా స్వాగతం పలకనున్న ట్రంప్‌

బీజింగ్‌ : మూడు రోజుల అమెరికా పర్యటన కోసం చైనా అధ్యక్షులు షీ జిన్‌పింగ్ బుధవారం బీజింగ్ నుండి బయలుదేరారు. ఈ పర్యటనలో జిన్‌పింగ్‌ వెంట ఆయన భార్య పెంగ్ లియువాన్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సిపిసి) కేంద్ర కమిటీ పొలిటికల్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యులు, సిపిసి కేంద్ర కమిటీ జనరల్ ఆఫీస్ డైరెక్టర్ అయిన కై క్వి, సిపిసి కేంద్ర కమిటీ పొలిటికల్ బ్యూరో సభ్యులు, విదేశాంగ మంత్రి అయిన వాంగ్ యి కూడా ఉన్నారు. ఈ పర్యటనను యావత్తు ప్రపంచం ఆసక్తిగా గమిస్తుంది. ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలను మరింత స్థిరత్వం వైపు నడిపిస్తుందని, అలాగే ప్రపంచ శాంతి, శ్రేయస్సును ప్రభావితం చేసే అంశాలపై సహకారాన్ని ముందుకు తీసుకువెళ్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా అగ్రనేతకు స్వాగతం పలికేందుకు స్వయంగా ట్రంప్‌ విమానాశ్రయానికి రానున్నారు. అయితే, చైనా కంపెనీలతో భారీ డీల్స్‌ చేసుకోవాలనే ట్రంప్‌ లక్ష్యం మాత్రం నెరవేరేలా లేదు. అమెరికా పర్యటనలో జిన్‌పింగ్‌ ఆయన వెంట పారిశ్రామికవేత్తలు, సిఇఒలు ఎవరూ రావడంలేదని అమెరికా సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ట్రంప్‌-జిన్‌పింగ్‌ మధ్య గురువారం భేటీ జరగనుంది. దీనికి అమెరికా వైపు నుంచి టెక్‌ సంస్థల సిఇఒలు హాజరవుతున్నారు. వీరిలో జుకర్‌బర్గ్‌, జెన్సన్‌ హువాంగ్‌, శామ్‌ ఆల్ట్‌మన్‌, సత్య నాదెళ్ల, జెఫ్‌ బెజోస్‌, టిమ్‌ కుక్‌, ఎలాన్‌ మస్క్‌, సుందర్‌ పిచాయ్‌, మైఖెల్‌ డెల్‌, జెన్‌ ప్రేసెర్‌, జెమీ డిమోన్‌ వంటి దిగ్గజాలు హాజరుకానున్నారు. అయితే చైనా పక్షాన ఎవరూ రావడంలేదని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఇప్పటికే కథనం వెలువరించింది. 2015లో ఇరు దేశాల మధ్య చర్చలకు జిన్‌పింగ్‌ పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చారు. కానీ, ఈ సారి భిన్నంగా పర్యటనకు వస్తున్నారు. ఇరు దేశాల మధ్య రాజకీయ, ఎఐ, తైవాన్‌ అంశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు ఇటీవల తీవ్రంగా మారిన విషయం తెలిసిందే. అమెరికాలో మిడ్‌టర్మ్‌ ఎన్నికలు దగ్గరపడటంతో ట్రంప్‌ కార్యవర్గానికి ఈ భేటీ కీలకంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్