ప్రజాశక్తి-అమరావతి : విజయవాడ కృష్ణలంక అప్పటి సిఐ నాగరాజు వేధింపుల కారణంగానే తన కుమారుడు పేరుపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డిజిపి, విజయవాడ పోలీస్ కమిషనర్, నార్త్‌జోన్ ఎసిబి, కృష్ణలంక పోలీస్టేషన్ ఇన్‌స్పెక్టర్, ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి ఎస్‌హెచ్‌ఒ నాగరాజుకు నోటీసులు జారీ చేసింది. ఎస్‌సి, ఎస్‌టి చట్టం కింద నమోదైన కేసుల్లో 30 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. పిటిషనర్ కుటుంబ సభ్యులను ఎలాంటి రీతిలోనూ బెదిరించొద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.పిటిషనరు తరపున న్యాయవాది పాలేటి మహేశ్వరరావు వాదిస్తూ.. ఈ ఏడాది మే 21న క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నారని, సిఐ నాగరాజు వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆయన స్వయంగా రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారని తెలిపారు. మే 22న పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తులో పురోగతి లేదన్నారు. సెల్ఫీ వీడియోను పోలీస్ కమిషనర్‌కు అందించినా చర్యలు తీసుకోలేదని, అనంతరం ఎస్‌సి, ఎస్‌టి చట్టంలోని సెక్షన్లను సవరించారని వివరించారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు ఇచ్చిన ప్రాధాన్యతను ఈ కేసుకు ఇవ్వడం లేదని, క్రాంతికుమార్ దళితుడు కావడంతోనే వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని పోలీసులు.. పిటిషనర్‌పై ఒత్తిడి తెస్తున్నారని, నార్త్‌జోన్ ఎసిపి వెనుక ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తును సిబిఐ లేదా సిట్‌కు అప్పగించాలని కోరారు. పోలీసుల తరపున ప్రభుత్వ సహాయ న్యాయవాది అజయ్ వాదిస్తూ.. ఎలాంటి వివక్ష చూపడం లేదని, సాయికృష్ణ లాకప్ డెత్ కేసుతో దీనిని పోల్చలేమని తెలిపారు.
Print Editionక్రాంతికుమార్ ఆత్మహత్యపై పోలీసులకు నోటీసులు
40 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 07:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)