ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిఎస్‌సిపై మండలిలో చర్చకు అంగీకరించకుండా ప్రభుత్వం తోకముడించిందని ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం నాడు మండలి వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సభను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. సభలో ఎల్‌నినోపై చర్చకు తాము సిద్ధమేనని, అయితే తొలుత డిఎస్‌సిపై చర్చించి తరువాత ఎల్‌నినోపై చర్చ జరపాలని కోరామన్నారు. కానీ సభలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు లేరని గుర్తుచేశారు. సభలో విద్యాశాఖ మంత్రి ఉన్నందున డిఎస్‌సిపై చర్చించాలని కోరామని, అయినా ప్రభుత్వం అంగీకరించలేదన్నారు. డిఎస్‌సిలో అక్రమాలు జరిగాయనడానికి తమ వద్ద ఆధారాలున్నాయని, చర్చకు భయపడి ప్రభుత్వం పారిపోయిందని అన్నారు. మెరిట్ లిస్టు బయటపెట్టాలని అడిగితే స్పందించని సిఎం.. పెద్దపెద్ద మాటలు చెబుతున్నారని, కానీ చర్చకు అనుమతించడం లేదని అన్నారు. గ్రూప్-1 పరీక్షలపైనా చర్చకు తాము సిద్ధమంటే ప్రభుత్వం మండలి బిఎసిలో గ్రూప్-1 అంశాన్ని ఎందుకు పెట్టలేదో తెలియడం లేదన్నారు. ఎల్‌నినో వచ్చినా ప్రభుత్వం రైతులకు ఎటువంటి సాయం అందించలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి, పోలీసుల వాహనాల్లోనే గంజాయి రవాణా జరుగుతుందనడానికి రాష్ర్టంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. గంజాయితో ఇద్దరు ఎస్‌ఐలు దొరికితే ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు.
Print Editionడిఎస్‌సిపై తోకముడిచిన ప్రభుత్వం : బొత్స
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 18, 2026, 11:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)