విద్యాభవన్ ముట్టడిలో ఉద్రిక్తత
దఫదఫాలుగా అరెస్టులు
వివిధ పోలీస్ స్టేషన్లకు తరలింపు
తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో టీచర్ల నిరసన
విద్యాశాఖ కమిషనర్‌తో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ, యుటిఎఫ్ నాయకుల చర్చలు, వినతి
ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ (గుంటూరు జిల్లా) : ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యాన గురువారం చేపట్టిన విద్యాభవన్ ముట్టడి కార్యక్రమంపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకొని బలవంతంగా అరెస్టు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో, ఉద్రిక్తత నెలకొంది. అక్రమ అరెస్టులను నిరసిస్తూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు ఎట్టకేలకు విడుదల చేశారు. ఉపాధ్యాయులపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ, యుటిఎఫ్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ విద్యాశాఖ కమిషనర్‌తో వారు చర్చలు జరిపారు. వినతిప్రతం అందజేశారు. తమ వృత్తి జీవితంలో ఇప్పటికే పలు పరీక్షలు, అర్హతలు, శిక్షణలు పూర్తి చేసి విధులు నిర్వహిస్తున్నామని, ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులను అర్హత పరీక్ష పేరుతో మరోసారి పరీక్షకు హాజరు కావాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులు ప్రశ్నించారు. ‘ఎవరికీ లేని పరీక్ష... మాకెందుకు ఈ శిక్ష? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ విద్యాభవన్‌ను ముట్టడించేందుకు యుటిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వివిధ మార్గాల్లో వస్తున్న వారిని విద్యాభవన్‌కు సమీపంలో పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్టు చేశారు. ఉపాధ్యాయు లను, ఎనిమిది జిల్లాల యుటిఎఫ్ జిల్లా నాయకుల ను తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, మంగళగిరి పట్టణ, మంగళగిరి రూరల్ తదితర పోలీస్ స్టేషన్లకు వాహనాల్లో తరలించారు. మధ్యాహ్నం తరువాత వారిని సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.
లోకేశ్ జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించాలి : ఎమ్మెల్సీ, యుటిఎఫ్ నాయకులు
ముట్టడి నేపథ్యంలో విద్యాభవన్ సమీపంలో జరిగిన ధర్నాలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు, యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకుని ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అరెస్టులకు పాల్పడడం ఉపాధ్యాయులను అవమానించమేన న్నారు. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం చూపాలని, టెట్ మినహాయింపుతో పాటు టెట్ రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని, తమిళనాడు అసెంబ్లీ తరహాలో రాష్ట్రంలోనూ టెట్ రద్దుకు ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. స్పెషల్ టెట్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని, అర్హత మార్కులను అందరికీ 60 శాతానికి తగ్గించాలని, అవసరం లేని సిలబస్‌ను తొలగించాలని కోరారు. సుమారు 60 వేల మంది ఉపాధ్యాయుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న టెట్ సమస్యపై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కలిసేందుకు పలుమార్లు అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఓఎస్డీ ఆకుల వెంకట్రావును కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ప్రభుత్వం తీరు ఇదేవిధంగా ఉంటే ఉద్యమం ఉధృతమవుతుందని హెచ్చరించారు. అనంతరం కొంతమందిని విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాల యంలోకి అనుమతిం చగా విద్యా శాఖ కమిషనర్‌తో గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్ ప్రసాద్ తదితరులు చర్చలు జరిపి వినతిపత్రం అందజేశారు.
ఉపాధ్యాయులకు రైతు సంఘం, *డివైఎఫ్‌ఐ నాయకుల పరామర్శ
పోలీసులు 50 మంది ఉపాధ్యాయులను తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించగా వారు స్టేషన్ మెట్లపై కూర్చుని ధర్నా చేశారు. ఉద్యమ పాటలు పాడారు. వీరిని రైతు సంఘం నాయకులు డి.వెంకటరెడ్డి, డివైఎఫ్‌ఐ నాయకులు డివి భాస్కర్‌రెడ్డి తదితరులు పరామర్శించి సంఘీభావం తెలిపారు. పట్టణంలోని నెహ్రూ బొమ్మ సెంటర్, నులకపేట జడ్‌పి పాఠశాలల ఉపాధ్యాయులు పోలీస్ స్టేషన్‌కు వచ్చి అరెస్టులను ఖండించారు. స్టేషన్లోని ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపారు.







కామెంట్‌లు (0)