గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజిఒ 69ని రద్దు చేయాలి..

1 గంట క్రితం

TRIBAL SCHOOL VISIT CPIM LEADER V SRINIVASA RAO (1).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 12:11 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • మారికవలస గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాల్సిందే

  • రుషికొండ భవంతులను ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్సీ’కి ఎందుకు కేటాయించరు? : వి శ్రీనివాసరావు

  • నెల రోజులకు ఒకే క్లాస్‌ అయింది... సౌకర్యాలు లేవు : సిపిఎం బృందం ఎదుట టెన్త్‌ విద్యార్థుల ఆవేదన

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : గురుకులాలను ప్రైవేటుకు అప్పగించేందుకు తీసుకొచ్చిన జిఒ 69ని ప్రభుత్వం రద్దు చేయాలని, మారికవలస గిరిజన గురుకులాన్ని యథావిధిగా అక్కడే కొనసాగించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ ‌చేశారు. విశాఖలోని మారికవలస గిరిజన గురుకులంలో 9, 10 తరగతుల విద్యార్థులతో పాటు కొత్తగా ఇక్కడకు వచ్చిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్సీ పిల్లలతో సహా వెయ్యి ‌మంది పిల్లల భవిష్యత్తును అగమ్యగోచరం చేసేలా రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయం ఉందన్నారు. గురువారం ఆయన మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తదితరులతో కలిసి సందర్శించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘ఇక్కడ మాకు సరిపడా గదుల్లేవు. ఫ్యాన్లు కూడా లేవు. కిటికీలు, తలుపులు కరువయ్యాయి. మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. దోమల బెడద ఎక్కువగా ఉంది. కటిక నేలపైనే పడుకుంటున్నాం. భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదు. నెల రోజులకు ఒకే క్లాస్‌ అయింది’ అంటూ పదో తరగతి విద్యార్థులు బి.చరణ్‌‌తేజ, దివ్య తేజ... సిపిఎం బృందం వద్ద సమస్యలను ఏకరువు పెట్టారు. గురుకులంలోని అన్ని తరగతి గదులూ, డార్మెటరీలనూ సిపిఎం నాయకులు పరిశీలించారు. టెన్త్‌ ‌విద్యార్థులు 38 మందినీ ఒకే రూమ్‌‌లో కుక్కేశారని, ఏ ప్రణాళికా లేకుండా గురుకులంలో సెంటర్‌ ఆఫ్ ఎక్సెలెన్సీని రప్పించడమే దీనికి కారణమని వి.శ్రీనివాసరావు అన్నారు. దళిత, గిరిజన విద్యార్థుల కోసం సెంటర్‌ ఎక్సెలెన్సీ పేరుతో ఐఐటి, జెఇఇ వంటి తరగతులను నిర్వహించడాన్ని సిపిఎం ఆహ్వానిస్తోందని, అయితే, క్లాస్‌‌ల నిర్వహణను ప్రభుత్వమే స్వయంగా చేపట్టి ఉపాధ్యాయులను నియమిం చాలని డిమాండ్‌ ‌చేశారు. అలాకాకుండా మారికవలసలో సెంటర్‌ ఎక్సెలెన్సీని ఫిజిక్స్‌ ‌వాలా అనే కార్పొరేట్‌ ‌సంస్థకు అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. మన టీచర్లు అంతకంటే బాగా చెబుతారన్నారు. ఉత్తరాదిలో జరిగిన నీట్‌ ‌వంటి పరీక్షల కుంభకోణాన్ని దేశం అంతా చూడలేదా? మళ్లీ ఫిజిక్స్‌ ‌వాలా ఏమిటి? అని ప్రశ్నించారు. గిరిజన విద్యార్థులకు ఐఐటి, నీట్‌, జెఇఇ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకే సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌‌లెన్స్‌ అని చెబుతూ ప్రస్తుతం నడుస్తున్న గురుకుల పాఠశాలలను ఎత్తివేస్తూ, అక్కడ విద్యార్థుల భవిష్యత్తును బలిచేయాలని చూడడం తగదన్నారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌‌ను రుషికొండలోని భవనాల్లో ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. అక్కడ మంచి వసతులున్నాయన్నారు. రుషికొండలో ఎపి టూరిజం ఆధ్వర్యాన నిర్మాణమైన భవనాలు సరిపోవా? లేదంటే గిరిజనులు అందుకు అర్హులు కారా? ఇలాంటి ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం ఎందుకు ఆలోచించదు? అని ప్రశ్నించారు. తనకు తానే ‘విజనరీ’ అని చెప్పుకునే చంద్రబాబుకు ఈ విషయాలేవీ తెలియవా? అని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. నాణ్యమైన విద్య అందించడానికే మారికవలస గిరిజన గురుకులంలో స్కూలు, కాలేజీ ఏర్పాటు చేశారని, ఇక్కడ చదువుకున్నవారు ఉద్యోగాలు సాధించారని గుర్తుచేశారు.

తర్లువాడలో ఎంఎల్‌ఎ గంటా శ్రీనివాసరావు ప్రోద్బలంతో రాత్రికి రాత్రి గూగుల్‌/అదాని డేటా సెంటర్‌ ‌కోసం పేదల భూములను తీసుకుని ఇంతవరకూ పరిహారం ఇవ్వలేదని, కార్పొరేట్ల కోసం మారికవలసలో రాత్రికి రాత్రి విద్యార్థులను తరలించేలా చేశారని, ఇది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ విషయమై తాను గంటాతో ముఖాముఖి చర్చకు సిద్ధమని సవాల్‌ ‌విసిరారు. మొత్తం విద్యార్థులను ఖాళీ చేయించేసి ప్రైవేట్‌ ‌వ్యక్తులకు మారికవలస గురుకులం స్థలాన్ని, విద్యాలయాన్ని అప్పగించాలని చూస్తే సిపిఎం ఊరుకోదని హెచ్చరించారు. ఫిజిక్స్‌ ‌వాలా, నారాయణ వంటి కార్పొరేట్ల కోసం టెన్త్‌ విద్యార్థులను ‌బలిపెట్టడం సరికాదన్నారు. గురుకుల విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదనను లెక్కచేయకుండా బలవంతంగా రాత్రికి రాత్రే పిల్లలను వేరొక చోటుకు తరలించడంతో ప్రభుత్వం తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొందని గుర్తు చేశారు. ఒకేచోట మారికవలసలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్సీ, గురుకులం విద్యార్థులను ఉంచడంతో ఇద్దరి భవిష్యత్తూ ‌దెబ్బతింటుందని ఆందోళన చెందారు. ప్రైవేట్‌ ఐటి కంపెనీల కోసం వందల ఎకరాలను కేటాయిస్తున్న ప్రభుత్వం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్సీని అక్కడే పెట్టవచ్చన్నారు. మారికవలస గురుకుల విద్యార్థులను తరలిస్తే ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. తక్షణమే రాష్ర్ట ప్రభుత్వం ఇక్కడ ఉపాధ్యాయులను ఇక్కడే ఉంచాలని, గిరిజనులకు నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్‌ ‌చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌‌కెఎస్‌‌వి.కుమార్‌, వి.కృష్ణారావు, బి.జగన్‌, కొండమ్మ, కుమారి, నరేంద్ర కుమార్‌, రెడ్డిపల్లి బాబూరావు, కిరణ్‌ ‌శేషు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్