క్లీన్ ఎనర్జీ, ఖనిజ రంగాలకు ప్రాధాన్యం
సంయుక్త మీడియా సమావేశంలో మోడీ, బార్ట్
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న వేళ భారత్, బెల్జియం ద్వైపాక్షిక సంబంధాలను మరింత వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వెవర్ మధ్య గురువారం విస్తృత చర్చలు జరిగాయి. అనంతరం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ..ప్రస్తుతం ప్రపంచం తీవ్ర మార్పులు, అనిశ్చితితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఆహారం, ఇంధనం, సరఫరా వ్యవస్థల నుంచి దాదాపు ప్రతి రంగంపైనా అంతర్జాతీయ పరిణామాల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులపై భారత్ వైఖరిని తెలియజేస్తూ అంతర్జాతీయ వివాదాలకు చర్చలు, దౌత్యం, న్యాయపాలన ఆధారంగా పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని మోడీ అన్నారు. భారత్, బెల్జియం మధ్య భవిష్యత్ సహకారంలో క్లీన్ ఎనర్జీ, సురక్షితమైన సరఫరా వ్యవస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఖనిజాల ప్రాసెసింగ్, రీసైక్లింగ్‌లో సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. సెమీకండక్టర్ రంగంలో బెల్జియం సాంకేతిక నైపుణ్యం, భారత్ వద్ద ఉన్న విస్తృత స్థాయి ఉత్పత్తి సామర్థ్యం ఒకదానికొకటి అనుకూలంగా ఉంటాయని మోడీ పేర్కొన్నారు.
వాణిజ్య బంధానికి ఊతం : బెల్జియం ప్రధాని బార్ట్
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు దేశాల సంబంధాలకు కొత్త అవకాశాలను తెరుస్తుందని బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ అన్నారు. భారత్, యూరప్ మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారతదేశాన్ని కేవలం ప్రాంతీయ శక్తిగానే పరిగణించలేని రీతిలో అత్యంత కీలకమైన దేశంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. వాణిజ్యం, సాంకేతికత, రక్షణ, భౌగోళిక రాజకీయాలు వంటి రంగాల్లో భారత్‌ను ముఖ్యమైన భాగస్వామిగా బెల్జియం చూస్తోందని పేర్కొన్నారు. కాగా బార్ట్ డి వెవర్ మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చారు. 2025 ఫిబ్రవరిలో బెల్జియం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి.







కామెంట్‌లు (0)