ఆ ఘోరానికి అమిత్ షాదే బాధ్యత
కదిలే బస్సులో బాలిక గ్యాంగ్‌రేప్‌పై బృందా కరత్
నోయిడా పోలీసు కమిషనరేట్ వద్ద ఐద్వా ఆందోళన
పోలీసుల నిర్లక్ష్యంపై నిష్పాక్షిక దర్యాప్తునకు డిమాండ్
నోయిడా : ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నుంచి దేశ రాజధాని శివారు వరకు బస్సులో తిప్పుతూ 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాల్సిందేనని సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ బృందాకరత్ డిమాండ్ చేశారు. ఈ దారుణ ఘటనకు అటు ఉత్తరప్రదేశ్, ఇటు ఢిల్లీ పోలీసింగ్‌కు బాధ్యత వహించే కేంద్ర హోంమంత్రిత్వ శాఖల ఘోర వైఫల్యమే కారణమని ఆమె పేర్కొన్నారు. బాలికలకు, మహిళకు రక్షణ కల్పించలేని ఈ డబుల్ ఇంజిన్ బిజెపి ప్రభుత్వం హక్కుల కోసం పోరాడుతున్న మహిళలను వేధింపులకు గురిచేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నోయిడా-ఢిల్లీ కదిలే బస్సులో బాలికపై సామూహిక అత్యాచారణ దారుణాన్ని నిరసిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో గురువారం నోయిడా పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో బృందాకరత్ పాల్గొన్నారు. మహిళలు, బాలికలకు రక్షణ, భద్రత కల్పించడంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. నేరస్థులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు ఇటు యుపిలో పోలీసులతో పాటు ఢిల్లీలో భద్రత వ్యవహారాలు చూసే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
పోలీసుల తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే నిందితులు ఈ నేరానికి పాల్పడ్డారని వస్తున్న కథనాలపై న్యాయమైన, నిష్పాక్షికమైన విచారణ జరపాలని ఐద్వా డిమాండ్ చేసింది. బాధ్యులపై బిఎన్ఎస్‌లోని నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐద్వా విజ్ఞప్తి కోరింది. అలాగే, ఈ ఆందోళన నేపథ్యంలో బుధవారం రాత్రి 11 గంటల నుంచే ఐద్వా గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా అధ్యక్షులు రేఖా చౌహాన్‌ను గృహ నిర్బంధంలో ఉంచడాన్ని ఐద్వా ఖండించింది. రేఖా చౌహాన్ ఇంటికి నలుగురు మగ పోలీసులు, ఒక మహిళా పోలీసు వెళ్లి బెదిరింపులకు గురి చేయడాన్ని ఐద్వా తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య హక్కులు, శాంతియుత నిరసన హక్కులపై దాడిగా పేర్కొంది. కాగా ఐద్వా ఆందోళనకు సిఐటియు సంఘీభావం ప్రకటించింది. సిఐటియు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)