సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పొగాకు రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్యం

1 గంట క్రితం

tobacco
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 09:55 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- పొగాకు కోనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెయ్యికోట్లు కేటాయించాలి

- రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పొగాకు రైతుల సంక్షోభాన్ని పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. తక్షణమే రూ.500 కోట్ల చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వాన్స్‌ నిధులు సమకూర్చి పొగాకు బోర్డు ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రైతులు ఉత్పత్తి చేసిన మొత్తం పొగాకును కొనుగోలు చేసేలా బోర్డుపై ఒత్తిడి తేవాలని, రైతుల సహకార సంఘాన్ని పునరుద్ధరించి దాని ద్వారా కొనుగోళ్లు నిర్వహించాలని కోరారు. సోమవారం విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద వర్జీనియా పొగాకు రైతుల సమస్యలపై సంయుక్త కిసాన్‌ మోర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు ద్వారా ప్రభుత్వాలకు భారీగా పన్నుల ఆదాయం వస్తున్నప్పటికీ, సంక్షోభంలో ఉన్న రైతులను ఆదుకోవడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ ఏడాది పొగాకు బోర్డు 142 మిలియన్‌ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, రైతులు సుమారు 236 మిలియన్‌ కిలోలు పండించారని తెలిపారు. ఇతర పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, సాగునీటి సమస్యలతో రైతులు పొగాకు సాగు వైపు మొగ్గుచూపారని చెప్పారు. ఉత్పత్తి అధికం కావడంతో ధరలు పడిపోయి రైతులు నష్టాల పాలవుతున్నారని పేర్కొన్నారు. కేంద్రం రూ.500 కోట్లు, రాష్ట్రం రూ.500 కోట్లు అడ్వాన్స్‌గా సమకూర్చి బోర్డు ద్వారా కొనుగోళ్లు చేయాలన్నారు. గతేడాది పొగాకుకు సగటున కిలోకు రూ.248 ధర లభించగా, ఈ ఏడాది సుమారు రూ.210కే పరిమితమైందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.50 వేల వరకు బ్యాంకు రుణాలు ఇప్పించడం సమస్యకు పరిష్కారం కాదని, అసలు సమస్య కొనుగోళ్లేనని స్పష్టం చేశారు. మాజీ సిఎం ఎన్ టి రామారావు హయాంలో ఏర్పాటు చేసిన పొగాకు రైతుల కోఆపరేటివ్‌ సొసైటీని పునరుద్ధరించి, రైతు సంఘాలతో సంప్రదించి దాని ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం వారానికి సుమారు 10 మిలియన్‌ కిలోలు మాత్రమే కొనుగోలు జరుగుతోందని, ఇదే వేగం కొనసాగితే రైతులు నెలల తరబడి ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాను ప్రారంభించిన ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పొగాకు రైతుల గోడు పట్టడం లేదని విమర్శించారు. కార్పొరేట్ పొగాకు కంపెనీలకు అనుకూలంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు కిలోకు కనీస సగటు ధర రూ. 250 లు ఇచ్చి కొనుగోలు చేయకపోగా పొగాకు పండించిన రైతులపై పరిమితికి మించి పండించారనే సాకుతో 15శాతం అపరాధ రుసుం విధించేందుకు నిర్ణయం తీసుకున్నారని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. పొగాకు రైతుల న్యాయమైన కోరికలను పరిష్కరించలేక రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూ.10 రూపాయలు బోనస్ గా ఇస్తామని చెప్పడం ఎవరిని మోసం చేసేందుకు అని ప్రశ్నించారు. కిలోకు 50 రూపాయలు బోనస్ గా ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన వడ్డీ లేని రుణం రూ.50 వేలు పొగాకు సాగుదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా సంయుక్త కిసాన్‌ మోర్చ్ కన్వీనర్‌ చుండూరు రంగారావు మాట్లాడుతూ పొగాకు బోర్డు రైతుల ప్రయోజనాలను కాపాడాల్సింది పోయి వ్యాపారులు, కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సమస్యను పరిష్కరించకపోతే సంయుక్త కిసాన్‌ మోర్చ్ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ప్రకాశం జిల్లా కార్యదర్శి జె జయంతి బాబు, ఎపి రైతు సంఘం కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు,ఎపి రైతు సంఘం ఉపాధ్యక్షులు యలమందరావు, శ్రీనివాస్‌, రైతు కూలీ సంఘం నాయకురాలు లలిత కుమారి, ప్రకాశం జిల్లా రైతు సంఘం కార్యదర్శి వడ్డి హనుమారెడ్డి, రైతు సంఘాల నాయకులు కె హనుమంతరావు, బి సురేష్, వల్లంరెడ్డి రాజగోపాల్ రెడ్డి , వీరబాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్