- పిటిషన్ల తరపున న్యాయవాదులు
ప్రజాశక్తి-అమరావతి : గ్రూప్-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని లేదా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి పర్యవేక్షణలో స్వతంత్ర సంస్థతో మూల్యాంకనం చేయించాలని ఉద్యోగాలకు ఎంపికకాని అభ్యర్థుల తరపున న్యాయవాదులు హైకోర్టును కోరారు. డిజిటల్ మూల్యాంకనంలో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన వారిలో 62 శాతం మంది మాన్యువల్ మూల్యాంకనంలో ఎంపిక కాలేదని, డిజిటల్‌తో పోలిస్తే మాన్యువల్ మూల్యాంకనంలో 197 మంది మార్కులు పెరగగా, 222 మంది మార్కులు తగ్గాయని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిందన్నారు. ఎంపికైన 165 మంది అభ్యర్థుల ఒఎంఆర్ షీట్లలో 160 మందికి సంబంధించిన వాల్యూయేషన్ స్లిప్పులపై దిద్దుబాట్లు, ఓవర్‌రైటింగ్ ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని వివరించారు. హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం జరిగిందని మొదట ఎపిపిఎస్‌సి కోర్టుకు తెలిపి, అనంతరం తప్పులు జరిగినట్లు అంగీకరించిందని, సిట్ దర్యాప్తులోనూ అక్రమాలపై అంశాలు వెలుగుచూశాయని వాదించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తరపున న్యాయవాదులు మాత్రం ఒఎంఆర్ షీట్లలోని దిద్దుబాట్లకు అభ్యర్థులను బాధ్యులను చేయడం సరికాదని, హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం జరిగిందనడానికి ఆధారాలు లేవని, సిట్ ఎంపిక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని నిర్ధారించలేదని పేర్కొన్నారు. ఎపిపిఎస్‌సి తరపున వాదించిన న్యాయవాది, నిబంధనల ప్రకారం అభ్యర్థులు రీకౌంటింగ్ మాత్రమే కోరగలరని, రీవాల్యుయేషన్‌కు అవకాశం లేదని తెలిపారు. గ్రూప్-1 ప్రధాన పరీక్ష నిర్వహణపై ఆరోపణలు లేవని, జవాబుపత్రాల మూల్యాంకనంపైనే అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. విజయవాడలో మళ్లీ మూల్యాంకనం చేయడానికి ముందు హాయ్‌ల్యాండ్‌లో జరిగిన ప్రక్రియను చెల్లనిదిగా ప్రకటిస్తూ ఎపిపిఎస్‌సి ఎలాంటి ప్రొసీడింగ్స్ జారీ చేసిందా అని ధర్మాసనం ప్రశ్నించగా, అలాంటివి ఏవీ లేవని ఎపిపిఎస్‌సి తరపున న్యాయవాది తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికకాని అభ్యర్థుల తరపున న్యాయవాదులు హాయ్‌ల్యాండ్‌లో జవాబుపత్రాలను 84 రోజులపాటు ఉంచడం, వేర్వేరు సిరాలు, వైట్నర్ వినియోగం, పిన్నింగ్ వంటి అంశాలను ప్రస్తావించారు. సిట్ తుది నివేదిక, ఇతర ఆధారాలపై వాదనలు కొనసాగుతుండగా, మంగళవారం కోర్టు సమయం ముగియడంతో హైకోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.






కామెంట్‌లు (0)