శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసు కమీషనరేట్‌‌గా గుంటూరు!

1 గంట క్రితం

guntur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 01:11 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- రాజధాని అమరావతి కలిపి మూడు జోన్లు

- ఏడుగురు డిసిపిలకు ప్రతిపాదనలు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాజధాని అమరావతి ప్రాంతంతోపాటు గుంటూరు జిల్లా మొత్తం కలిపి పోలీస్ కమీషనరేట్‌గా మార్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కమిషనరేట్‌‌కి సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర డిజిపి కార్యాలయం నుంచి జిల్లా ఎస్‌‌పికి ఇటీవల ఆదేశాలు అందాయి. ఈ మేరకు డిజిపి కార్యాలయమే కొన్ని మార్గదర్శకాలను కూడా ప్రతిపాదించింది. ఈ మార్గదర్శకాల మేరకు జిల్లా అధికారులు కమీషనరేట్‌‌కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి రెండు రోజుల క్రితం తిరిగి డిజిపి కార్యాలయానికి పంపారు. కమీషనర్‌గా ఐజి స్థాయి అధికారి, జాయింట్ కమిషనర్‌గా డిఐజి స్థాయి అధికారి, ఏడు జోన్లకు ఏడుగురు డిసిపిలు ఉండేలా ప్రతిపాదనలు రూపొందించారు. రాజధాని ప్రాంతంగా ఉన్న తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, తాడేపల్లి మండలాలను కలిపి ఒక జోన్‌‌గా రూపొందించి శాంతిభద్రతల పరిరక్షణకు ఒక డిసిపిని ప్రతిపాదించారు. అమరావాతిలో హై సెక్యూరిటీ జోన్‌‌గా విఐపిల భద్రతకు మరో డిసిపిని కేటాయించాలని, తెనాలి ప్రాంతంలో ఒకజోన్‌, గుంటూరు సిటీతో పాటు పరిసర ప్రాంతాలన్నిం టిని కలిపి మరో జోన్‌‌గా నిర్ణయించారు. ట్రాఫిక్‌‌, క్రైం, పరిపాలన విభాగాలకు ముగ్గురు వేర్వురు డిసిపిలను కూడా ప్రతిపాదించారు. మొత్తం ఏడుగురు డిసిపిలతో పాటు ఒక ఐజి, ఒక డిఐజి స్థాయి అధికారులు కమీషనరేట్‌ ‌పరిధిల్ పనిచేస్తారు. గుంటూరు కమిషనరేట్ పరిధిలో మొత్తం తొమ్మిది మంది ఐపిఎస్‌ అధికారులు పనిచేస్తారు. వీరిల్ సీనియర్‌ అధికారులు ఐజి స్థాయిలో కమీషనర్‌, జాయింట్‌‌ కమీషనర్‌‌గా డిఐజి స్థాయి అధికారులు, ఏడుగురు డిసిపిలు ఎస్‌పి స్థాయిలో పనిచేయనున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న డిఎస్‌‌పిలంతా ఎసిపిలుగా మారనున్నారు. అమరావతి రాజధానిని హై సెక్యూరిటీ జోన్ గా మార్చాలనే ప్రభుత్వ ఆలోచనలో భాగంగా ఈ ప్రాంతానికి ఇద్దరు డిసిపిలను నియమించాలని యోచిస్తోంది. రాజధాని అమరావతిలో పెరుగుతున్న నేరాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల అమరావతి ఒఎస్‌‌డిగా ఒక యువ ఐపిఎస్‌ అధికారి రామనాథ హెగ్డేను నియమించారు. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలు పూర్తయితే అమరావతిలో హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు నివసించే అవకాశం ఉంది. ఇప్పటికే సిఎం చంద్రబాబు నాయుడు, మాజీ సిఎం జగన్‌, ఉప ముఖ్యమంత్రి పవన్‌ ‌కల్యాణ్‌‌తోపాటు పలువురు మంత్రులు తాడేపల్లి మండల పరిధిలోనే నివాసం ఉంటున్నారు. దీంతో ఈ ప్రాంతం మొత్తం కలిపి హై సెక్యూరిటీ జోన్‌‌గా పరిగణించాలని నిర్ణయించారు. అంతేగాక తెనాలిలో కూడా నేరాలు పెరుగుతుండటం వల్ల ఈ సబ్‌ ‌డివిజన్‌‌ను జోన్‌‌గా మార్చాలని ప్రతిపాదించారు. మంగళగిరి సబ్‌ ‌డివిజన్‌‌ పరిధిలో విఐపిలు ఎక్కువగా నివసిస్తున్నందున ఈ ప్రాంతాన్ని ఒక జోన్‌‌గా ప్రతిపాదించి ఒక డిసిపిని నియమించాలని సూచించారు. మొత్తం మంగళగిరి పరిధిలో సిబ్బంది కొరత ఉండటంతో 600 మంది పోలీసులు కావాలని కూడా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే 2014 నుంచి 2019 మధ్య పోలీసు కమిసనరేట్‌‌పై ప్రతిపాదనలు చేసినా ఆచరణకు నోచుకోలేదు. ఒక దశలో గుంటూరు, విజయవాడ నగరాలు కలిపి మెగా కమీషనరేట్‌ ‌చేయాలని అప్పటి విజయవాడ కమీషనర్‌ ఎ.బి.వెంకటేశ్వరరావు కూడా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లా మొత్తం ఒక కమిషనరేట్‌ ‌పరిధిలో ఉండటంతో గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంతం మొత్తం ఉండటంతో ఈసారి జిల్లా మొత్తం కలిపి ఒకే యూనిట్‌ ‌కమిషనరేట్‌ ‌ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలిసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్