శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సద్దుమణిగిన పశ్చిమాసియా

1 గంట క్రితం

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 01:08 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- టెహ్రాన్‌కు ఖతార్ ప్రతినిధులు

- చర్చలకు కట్టుబడివున్నామన్న అమెరికా

- చాబహార్‌పై ప్రయోగించిన క్షిపణిపై అనుమానాలు

టెహ్రాన్ : అమెరికా, ఇరాన్‌ మధ్య రెండు రోజుల పాటు జరిగిన తీవ్ర దాడుల అనంతరం పశ్చిమాసియాలో తుపాకుల మోత ఆగిపోయింది. దౌత్య సంబంధాలను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా ఖతార్ ప్రతినిధులు టెహ్రాన్‌కు వెళ్లినట్టు సమాచారం. టెహ్రాన్‌తో చర్చలకు వాషింగ్టన్ కట్టుబడి ఉందని, సాంకేతిక చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. కాగా అమెరికా, ఇరాన్‌‌ మధ్య దాడులు, ప్రతిదాడుల కారణంగా హార్ముజ్ జలసంధిలో నౌకాయానం తీవ్రంగా పడిపోయింది. చరిత్రలోనే అతిపెద్ద సరఫరా అంతరాయంతో ఇప్పటికే కుదేలైన ఇంధన మార్కెట్లకు ఇది మరో దెబ్బగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా తమ దాడులను నిలిపివేసినట్టు ప్రకటించింది. అయితే ఓ వైపు చాబహార్ పోర్టుపై దాడులు జరిగాక.. తాము చేయలేదని ట్రంప్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ విషయంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇరాన్‌ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ ఖననానికి ఇరాన్ సిద్ధమవుతున్న తరుణంలో గురువారం ఈ దాడులు మొదలైన సంగతి తెలిసిందే. అవి దక్షిణ ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై జరిగాయి. ఈ దాడులకు ఇరాన్ నేరుగా ఎవరినీ నిందించలేదు. అయినప్పటికీ ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న ప్రచారానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) మద్దతు ఇస్తోందని ఒక చట్టసభ సభ్యుడు హెచ్చరించారు. అయితే ఓవైపు ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నప్పటి నుంచే ట్రంప్ వివాదాస్పద ప్రకటనలు చేశారు. ఇరాన్‌‌పై భీకరపోరు తప్పదని హెచ్చరికలు చేసిన విషయం విదితమే. ఆ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే ఇరాన్‌‌పై మళ్లీ దాడులు జరిగాయి. దేశంలోని బుషెహర్, సిస్తాన్-బలూచిస్తాన్ ,ఫ్రావిన్సులు, అహ్వాజ్ , చాబహార్ నగరాలు, ఇంకా ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పలు వైమానిక దాడులు , పేలుళ్లు జరిగినట్టు ఇరాన్ వార్తా సంస్థలు , ప్రభుత్వ మీడియా నివేదించాయి. భారత్ నిర్వహణలో ఉన్న చాబహార్ పోర్టుపై క్షిపణుల దాడి వెనుక అమెరికా, ఇజ్రాయిల్ ఉన్నాయా? అన్న అంశం ఇంకా తేలలేదు. మరోవైపు ఈ దాడులపై సెంట్రల్ కమాండ్ కూడా స్పందించలేదు.

ఏకంగా 80 స్థానాలపై అమెరికా విరుచుకుపడితే.. ఇటు ఇరాన్ కూడా తగ్గలేదు. అంతే దీటుగా స్పందించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడులకు దిగింది. తాము దాడులకు పాల్పడలేదని ట్రంప్ మరో సారి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే ఇరాన్‌లో ఈ దాడులు ఎవరు చేశారనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. గురువారం జరిగిన దాడులకు ప్రతిస్పందనగా, అంతకుముందు ఇరాన్ మధ్యప్రాచ్యంలో బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్‌లను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులు చేసింది. ఇరాన్ దాడి జరిగిన వెంటనే, యూఏఈ నాయకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. కువైట్ పాలకుడిని కలవడానికి ఆ దేశానికి వెళ్లారు. గల్ఫ్ అరబ్ దేశాలు కూడా ఖతార్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపాయి.

ఇరాన్‌పై జరిగిన దాడులకు ఇజ్రాయిల్ సాధారణంగా వెంటనే బాధ్యత తీసుకుంటుంది. తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయిల్‌ ‌నుంచి ఎలాంటి ప్రకటనా రాకపోవడం గమనార్హం. గురువారం రాత్రి నెతన్యాహు ట్రంప్‌తో మాట్లాడారని, గల్ఫ్‌లో అమెరికా చర్యల గురించి ట్రంప్ ఆయనకు వివరించారని ఇజ్రాయిల్ ప్రభుత్వం తెలిపింది. అవసరమైతే ఇరాన్‌ను ఎదుర్కోవడానికి తమ దేశం సిద్ధంగా ఉందని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ కూడా తన హెచ్చరికను పునరుద్ఘాటించారు.

ఒక సైనిక కార్యక్రమంలో కాట్జ్ మాట్లాడుతూ.. ‘‘కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి, గగనతల ఆధిపత్యాన్ని తిరిగి పొందడానికి, ముప్పులను తొలగించడానికి, అవసరమైతే మూడోసారి అయినా ఇరాన్‌పై ‘నీలి-తెలుపు’ (ఇజ్రాయిల్) దాడిని ప్రారంభించడానికి ఇజ్రాయిల్ సైన్యం అప్రమత్తంగా , సిద్ధంగా ఉంది’’ అని అన్నారు. ‘‘మేము తిరిగి రావాల్సి వస్తే, మరింత పెద్ద బలంతో తిరిగి వస్తాము’’ అని ఆయన చెప్పారు.

హార్ముజ్ జలసంధి నౌకాయానానికి తెరిచి, స్వేచ్ఛగా ఉండాలని అరబ్ దేశాలు, అమెరికా పట్టుబడుతున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. ఆ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉండాలని , నౌకలు టెహ్రాన్‌కు రుసుములు చెల్లించడం ప్రారంభించాలని ఇరాన్ అంటోంది. వాస్తవానికి యుద్ధోన్మాద పరిస్థితులతో అమెరికాకు కలుగుతున్న భారీ నష్టం, అమెరికన్లలో తీవ్ర వ్యతిరేకత కారణంగా ట్రంప్‌‌నకు ప్రతిబంధకంగా మారాయన్నది మాత్రం వాస్తవమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్