శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు జెఎన్‌టియు-జివి ప్ర‌థ‌మ‌ స్నాత‌కోత్స‌వం

1 గంట క్రితం

jntu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 01:06 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- హాజరు కానున్న గవర్నర్, మంత్రి లోకేష్‌

- 34,896 మందికి పట్టాలు ప్రదానం : వైస్‌ ఛాన్సలర్‌

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం–గురజాడ, విజయనగరం ప్రథమ స్నాతకోత్సవాన్ని శ‌నివారం విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు జెఎన్‌టియు-జివి వైస్‌ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.వి. సుబ్బారావు తెలిపారు. స్థానిక జెఎన్ టియు ప్రాంగ‌ణంలో శుక్ర‌వారం నిర్వ‌హించిన విలేక‌ర్ల స‌మావేశంలో స్నాత‌కోత్స‌వ వివ‌రాల‌ను ఆయ‌న వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న స్నాతకోత్సవంలో రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్, యూనివ‌ర్సిటీ ఛాన్స‌ల‌ర్‌ ఎస్‌.అబ్దుల్ న‌జీర్, మంత్రి లోకేష్‌, నిర్మాణ్ ఆర్గ‌నైజేష‌న్ సిఇఒ మ‌యూర్ ప‌ట్నాల త‌దిత‌ర ప్ర‌ముఖులు, ప‌లువురు ఉన్న‌తాధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. 2023, 2024, 2025 సంవ‌త్స‌రాల్లో ఉత్తీర్ణులైన సుమారు 34,896 మందికి ఈ కాన్వ‌కేష‌న్‌లో పట్టాలు ప్రదానం చేయనున్నారు. వీరిలో 32,177 మందికి డిగ్రీ, 2,708 మందికి పిజి, 11 మందికి పిహెచ్‌డి, 50 మందికి బంగారు ప‌త‌కాలు, ఇద్ద‌రికి ఎండోమెంట్ ప‌థ‌కాలు, 37 అఫ్లియేటెడ్ కాలేజీలు, ఇద్ద‌రికి కాన్‌స్టియెంట్ కాలేజీలు, ఒక‌రికి గౌర‌వ డాక్ట‌రేట్ అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారిగా బ్లాక్ చైన్ టెక్నాల‌జీని ఉప‌యోగించి డిగ్రీ ప‌ట్టాల‌ను రూపొందించామ‌ని చెప్పారు. ఈ ప్రాంతంలోని యువ‌త‌కు ఉపాధి క‌ల్పించే ల‌క్ష్యంతో వారి పేర్ల‌ను న‌మోదు చేసుకొనేందుకు ఒక వెబ్ పోర్ట‌ల్‌ను ఏర్పాటు చేశామని, ఈ పేజీలో న‌మోదు చేసుకున్న వారికి ఉద్యోగాల‌ను క‌ల్పించాల‌న్న‌దే త‌మ ల‌క్ష్యంగా పేర్కొన్నారు. ఇప్ప‌టికే త‌మ క్యాంప‌స్ ఎంఎస్ఎంఇ ఎక్స్‌టెన్ష‌న్ సెంట‌ర్‌గా ఎంపిక‌య్యింద‌ని, నిరుద్యోగ యువ‌త‌కు నైపుణ్య‌ శిక్ష‌ణ ఇచ్చి, వారికి ఉపాధి క‌ల్పించేందుకు కృషి చేస్తామ‌ని తెలిపారు. ఐటిఐ ఎల‌క్ట్రిక‌ల్ ట్రేడ్ లో ఉత్తీర్ణులైన వారిలో 30 మందిని ఎంపిక చేశామ‌ని, వారికి జ‌ర్మ‌న్ భాష‌లో శిక్ష‌ణను ఇచ్చి ఆ దేశానికి పంపిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ (ఇన్‌చార్జి) ప్రొఫెసర్ డి. రాజ్యలక్ష్మి, ప్రజా సంబంధాల అధికారి డిడి వి.శివరాం రోలంగి త‌దిత‌రులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్