- కలెక్టరేట్ల వద్ద భారీ ఆందోళనలు
- పలుచోట్ల కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట
- సమస్యలు పరిష్కరించకపోతే 31న కలెక్టరేట్లు ముట్టడిస్తామన్న నేతలు
ప్రజాశక్తి-యంత్రాంగం : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు కదంతొక్కారు. కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆయా జిల్లాలోని అన్ని మండలాల నుంచి అంగన్‌వాడీలు నల్ల చీరలు ధరించి పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పని భారం మోపే నవచేతన యాప్ ను రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న టిఎ బిల్లులు వెంటనే చెల్లించాలని, పెన్షన్, పిఎఫ్, ఇఎస్‌ఐ వంటి సామాజిక భద్రతా సదుపాయాలు అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లగా అప్‌గ్రేడ్ చేయాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, ముఖ్యమంత్రి, మంత్రి గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలనే నినాదాలతో కలెక్టరేట్లు హోరెత్తాయి. కలెక్టరేట్లలోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో పలు జిల్లాల్లో పోలీసులకు, అంగన్‌వాడీలకు మధ్య వాగ్వివాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. కోర్కెల దినంలో భాగంగా ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ రెండు వారాల్లో సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 31న కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఏలూరులో జ్యూట్ మిల్లు సెంటర్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుండి అంగన్‌వాడీలు ఎర్రజెండాలు పట్టుకుని, నల్ల చీరలు ధరించి ఫైర్ స్టేషన్ మీదుగా కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ బైఠాయించారు. బారికేడ్లను ఏర్పాటు చేసిన వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో, అంగన్‌వాడీలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. అంగన్‌వాడీలు బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిం చారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఒక దశలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ వద్దకు జిల్లా రెవెన్యూ అధికారి మైథిలి, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శారద వచ్చి చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దీనికి ముందు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి కూటిమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయకుండా మోసగిస్తోందని విమర్శించారు. అంగన్‌వాడీల డిమాండ్లు న్యాయబద్ధమైనవి, వాటిని వెంటనే నెరవేర్చాలని కోరారు. భీమవరంలో కలెక్టరేట్‌కు ఉదయం ఏడు గంటలకే అంగన్‌వాడీలు తరలొచ్చి బైఠాయించారు. కలెక్టర్ బయటకు వచ్చి తమ గోడు వినాలని నినదిం చారు. అయినా, స్పందన లేకపోవడంతో కలెక్టరేట్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ వీరవాసరంలో ప్రత్యేక పిజిఆర్‌ఎస్‌లో ఉన్నారని, డిఆర్ఒ వస్తారని చెప్పి సముదాయించారు. ఇంతలో డిఆర్‌ఒ అక్కడికి వచ్చి వారితో మాట్లాడి వినతిపత్రం తీసుకున్నారు. కలెక్టర్‌తో మాట్లాడి సమస్యలపై ఒక కమిటీ వేస్తామని హామీ ఇవ్వడతో ఆందోళన విరమించారు.
భారీగా తరలివచ్చిన అంగన్‌వాడీల నినాదాలతో విజయవాడ ధర్నా చౌక్ దద్దరిల్లింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకనుగుణంగా, సుప్రీంకోర్టు చెప్పిన విధంగా అంగన్‌వాడీలకు తక్షణమే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నాలో ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి మాట్లాడుతూ పనిభారం పెంచి అంగన్‌వాడీలను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కలెక్టరేట్ నుంచి బొమ్మూరు సెంటర్ వరకూ, కాకినాడలో జడ్పి సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం జిల్లా ఒంగోలు, బాపట్ల కలెక్టరేట్లలోకి వెళ్లేందుకు అంగన్‌వాడీలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, తీవ్రస్థాయిలో తోపులాట చోటుచేసుకుంది. గుంటూరులో పోలీసుల అడ్డంకులను అధిగమించి కలెక్టరేట్‌లోకి వెళ్లి కలెక్టరేట్ ఇఒకు వినతిపత్రం అందజేశారు. నరసరావుపేటలో ధర్నా చౌక్ నుండి కలెక్టరేట్ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మార్కాపురంలో ఆర్‌డిఒ కార్యాలయాన్ని అంగన్‌వాడీలు ముట్టడించారు. నెల్లూరు భారీ ప్రదర్శన, కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు కడప, అన్నమయ్య కలెక్టరేట్ల ఎదుట కదం తొక్కారు.
కర్నూలులో కలెక్టరేట్ గేట్లు తోసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా డిఆర్ఒ వెంకట్ నారాయణమ్మ వారి వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. నంద్యాలలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ కు వినతిపత్రం అందజేశారు. విశాఖలో జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట పొర్లు దండాలు పెడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకున్నారు.
అనకాపల్లిలో నల్ల దుస్తులు ధరించి, కళ్లకు గంతలు కట్టుకుని భారీ ప్రదర్శన, నెహ్రూ చౌక్ జంక్షన్‌లో మానవహారం నిర్వహించారు. అనంతరం ఎన్‌టిఆర్ స్టేడియం వద్ద జరిగిన బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేసే కుట్ర సాగుతోందని విమర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ఐటిడిఎ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించారు. పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరంలో కలెక్టరేట్‌ను అంగన్‌వాడీలు ముట్టడించి నిరసన తెలిపారు. పార్వతీపురంలో భారీ ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద నాలుగు రోడ్లు జంక్షన్లో రాస్తారోకో చేశారు. దీంతో, వారి వద్దకు ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ బాలామణి వచ్చి సమస్యలు విన్నారు. అనంతపురం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి మహాధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు. కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఒ.నల్లప్ప మద్దతు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కలెక్టరేట్ కు ర్యాలీగా వెళ్తున్న అంగన్‌వాడీలను ఆర్‌టిసి డిపో వద్ద పోలీసులు అడ్డుకోవడంతో వారు అక్కడే ప్రధాన రహదారిపై రెండు గంటలపాటు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తిరుపతి కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీలు ఏర్పాటు చేసుకున్న టెంట్ ను పోలీసులు బలవంతంగా తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులకు, అంగన్‌వాడీలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. శ్రీకాకుళంలో అంగన్‌వాడీలు ఆర్అండ్‌బి బంగ్లా రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శనగా వెళ్లి అక్కడ బైఠాయించారు.







కామెంట్‌లు (0)