ఘనంగా ప్రారంభమైన గురజాడ 164వ జయంతి ఉత్సవాలు
ప్రజాశక్తి – విజయనగరం కోట: మహాకవి, సంఘసంస్కర్త గురజాడ వెంకట అప్పారావు 164వ జయంతి ఉత్సవాలు విజయనగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో తొలిసారిగా రాష్ట్ర పండుగగా ఉత్సవాలను నిర్వహించారు. గురజాడ స్వగృహంలో ఆయన చిత్రపటానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసరావు, బీశెట్టి బాబ్జీ, జేసీ సెతుమాధవ్ తదితరులు పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
గురజాడ స్వగృహం నుంచి ఎంఆర్ కళాశాల కూడలిలోని గురజాడ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గురజాడ వారసులు, విద్యార్థులు, చిన్నారులు, కవులు, కళాకారులు, రచయితలు, సంఘసంస్కర్తలు, ప్రజాప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు. ‘దేశమును ప్రేమించుమన్నా... మంచి అన్నది పెంచుమన్నా...’ తదితర గురజాడ గేయాలను ఆలపిస్తూ ర్యాలీ కొనసాగింది. ఎంఆర్ కళాశాల కూడలిలోని గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గురజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించాలని గతంలో తాను, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను కోరినట్లు తెలిపారు. వారి స్పందనతో ఈ ఏడాది నుంచి గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. గురజాడ రచనలు, గేయాలు, నాటికలు నేటికీ స్ఫూర్తిదాయకంగా, చిరస్మరణీయంగా నిలిచాయని చెప్పారు. ‘కన్యాశుల్కం’ నాటకం ద్వారా సమాజంలోని రుగ్మతలు, సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు గురజాడ కృషి చేశారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం సంతోషకరమన్నారు. బాల్యవివాహాలు, ఇతర సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గురజాడ తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారని తెలిపారు. ఆయన సేవలను గుర్తిస్తూ పీవీజీ రాజు ‘అభినవ ఆంధ్ర భోజ’ బిరుదుతో సత్కరించారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’లో గురజాడను ప్రస్తావించారని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసరావు మాట్లాడుతూ గురజాడ అప్పారావు విజయనగరం జిల్లాకే కాకుండా జాతికే మణిమాణిక్యమన్నారు. ఆయన సాహిత్యం, సామాజిక ఆలోచనలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో గురజాడ మునిమనవడు గురజాడ వెంకట ప్రసాద్, గురజాడ ఇందిరా, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్, సంఘసంస్కర్తలు, కవులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










కామెంట్‌లు (0)