- టూ టౌన్ పోలీసుల దాడిలో భారీగా నిషేధిత గుట్కా స్వాధీనం
- ఇంట్లో నిల్వ ఉంచి విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
ప్రజాశక్తి–మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో నిషేధిత గుట్కా అక్రమ వ్యాపారంపై టూ టౌన్ పోలీసులు కొరడా ఝళిపించారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలోని మసీదు పక్కన ఉన్న ఓ ఇంటిపై ఆకస్మికంగా దాడి నిర్వహించి భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వరద అనే వ్యక్తి తన నివాసంలో పెద్దఎత్తున గుట్కా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో టూ టౌన్ పోలీసులు దాడి చేసి నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. స్థానిక యువతతో పాటు ఉపాధి కోసం మదనపల్లెకు వచ్చిన కార్మికులను లక్ష్యంగా చేసుకుని గుట్కా విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజారోగ్యానికి హానికరమైన నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిషేధిత గుట్కా విక్రయాలు, నిల్వలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.







కామెంట్‌లు (0)