- మంత్రి వంగలపూడి అనిత
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నైరుతి రుతుపవనాల కాలంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలు, జీవనోపాధి పరిరక్షణే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. విపత్తులు సంభవించిన తర్వాత స్పందించడం కంటే, వాతావరణ హెచ్చరికల ఆధారంగా ముందస్తు చర్యలు చేపట్టి ‘జీరో లాస్’ లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో 24 గంటల కంట్రోల్ రూమ్‌లు నిరంతరం పనిచేసేలా చూడాలని, ఐఎండి, ఎపిఎస్‌డిఎంఎ, ఆర్టిజిఎస్ హెచ్చరికలను ప్రజలకు వెంటనే చేరవేయాలని ఆదేశించారు. నైరుతి రుతుపవనాల కోసం రూపొందించిన ప్రామాణిక కార్యాచరణ విధానాలను అన్ని శాఖలు ఖచ్చితంగా అమలు చేయాలని, ప్రతిరోజూ చేపట్టిన చర్యలపై నివేదికలను సమర్పించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు వ్యక్తిగతంగా సన్నద్ధత, ప్రతిస్పందన చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశముందని పేర్కొంటూ, రాష్ట్రంలోని 688 మండలాల్లో 105 మండలాలు తీవ్రంగా, 208 మండలాలు మధ్యస్థంగా ప్రభావితమయ్యే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య జిల్లాలు తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ శాఖ రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, విత్తనాలు, ఎరువులపై అవగాహన కల్పించాలని, ఉద్యానవన శాఖ డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ వంటి పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ పశుగ్రాసం, తాగునీరు, అత్యవసర పశువైద్య సేవలు సిద్ధంగా ఉంచాలని, మత్స్యశాఖ సముద్ర వాతావరణ హెచ్చరికలను సకాలంలో మత్స్యకారులకు చేరవేయాలని ఆదేశించారు. వరదలు, పిడుగులు వంటి విపత్తులకు ముందస్తు ప్రణాళికలతో మాక్ డ్రిల్లులు నిర్వహించాలని సూచించారు. పిడుగుపాటుకు గురైన 141 మంది కుటుంబాలకు రూ.5.61 కోట్ల ఎక్స్‌గ్రేషియా, పశువుల నష్టానికి రూ.30.81 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఎపిఎస్‌డిఎంఎ ఎండి ప్రఖర్ జైన్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)