మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సిఎం విజయ్‌..

1 గంట క్రితం

దుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సిఎం విజయ్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 12:11 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అనంతరం ఎపి సిఎం చంద్రబాబుతో భేటీ

  • నేడు దుర్గగుడికి రాష్ట్రపతి ముర్ము రాక

ప్రజాశక్తి - ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ మంగళవారం విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యాన జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల మూడో రోజున శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను విజయ్‌ దర్శించుకున్నారు. రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మంత్రి పి.నారాయణ, స్థానిక ఎంపి కేశినేని శివనాథ్‌ (‌చిన్ని) దేవాదాయ కమిషనర్‌ ‌కె.రామచంద్రమోహన్‌, ఆలయ ఇఒ శీనా నాయక్‌, చైర్మన్‌ ‌బొర్రార రాధాకృష్ణ ఆయన వెంట ఉన్నారు. ఆలయ అధికారులు శేషవస్త్రం, దుర్గమ్మ చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. సుమారు 25 నిమిషాలపాటు ఆలయ ప్రాంగణంలో విజయ్‌ గడిపారు. దర్శనం అనంతరం ఉండవల్లిలోని ఎపి సిఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత ఎపి, తమిళనాడు సిఎంలు ఇద్దరూ విజయవాడ పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన సరస్సు ఉత్సవ్‌లో పాల్గొన్నారు. ముందుగా చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ (గన్నవరం) విమానాశ్రయానికి చేరుకున్న విజయ్‌కు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన నేరుగా దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చారు. విజయ్‌ సిఎం హోదాలో తొలిసారి ఎపికి రావడంతో ఆయన అభిమానులతో నగరం కోలాహలంగా మారింది. పెద్దఎత్తున అభిమానులు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ప్రయాణించిన కారు వెంట పరుగులు తీశారు. విజయ్‌ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

మూడో రోజుకు ఉత్సవాలు...

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం మూడో రోజుకు చేరుకున్నాయి. భవానీలు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి క్యూ కట్టారు. ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం తరఫున ఆలయ ఇఒ వి.త్రినాథరావు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

నేడు రాష్ర్టపతి రాక...

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రాత్రి దుర్గమ్మను దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాత్రి 7.10 నుండి 7.40 గంటల వరకు సాధారణ దర్శనాలు, క్యూలైన్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్