ప్రజాశక్తి - అమరావతి : ఎంబిబిఎస్, బిడిఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో ప్రతి విడతకు ముందు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తూ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ జారీ చేసిన జిఓ 102పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ జిఓ అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు కారణాలు కనిపించడం లేదని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. అన్ని సీట్లకు కలిపి ఒకేసారి వెబ్ ఆప్షన్ ఇచ్చే విధానాన్ని రద్దు చేసి, ప్రతి విడత కౌన్సెలింగ్‌కు ముందు వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తూ వైద్యశాఖ జూలై 30న జిఓ 102 జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఠాగూర్ వాదనలు వినిపిస్తూ 2020లో జారీ చేసిన జిఓ151 ప్రకారం విద్యార్థులు ఒక్కసారి మాత్రమే వెబ్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉండేదన్నారు. తాజా జీవోతో ప్రతిభావంతులైన రిజర్వ్‌డ్ కేటగిరీ విద్యార్థులు ఓపెన్ కేటగిరీ సీట్లు పొందే అవకాశాలు కోల్పోతారని తెలిపారు. ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్సిటీ తరఫున న్యాయవాది టీవీ శ్రీదేవి, ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణచైతన్య వాదిస్తూ.. ఒక్కసారి మాత్రమే వెబ్ ఆప్షన్ ఇవ్వడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని పలువ్యాజ్యాల్లో హైకోర్టు తప్పుపట్టిందన్నారు. అందుకే ప్రతి విడతకు ముందు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించామని తెలిపారు. ఇదే జిఓను సవాల్ చేస్తూ బిసివైపి అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ దాఖలు చేసిన పిల్‌లోనూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు ఇటీవల నిరాకరించింది.
Print Editionవైద్య ప్రవేశాల వెబ్ ఆప్షన్ల జిఓపై స్టేకు హైకోర్టు నిరాకరణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 13, 2026, 11:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)