గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భారీ వర్షాలతో పొంగిన కొండవాగులు

1 గంట క్రితం

Screenshot from 2026-09-24 11-42-25.png
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 11:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సీలేరు, సోకిలేరు ఉపనదుల తాకిడికి ఉగ్రరూపం దాల్చిన శబరి

  • 50 గ్రామాలకు రాకపోకలు స్తంభితం

ప్రజాశక్తి – చింతూరు : భారీ వర్షాల ప్రభావంతో చింతూరు డివిజన్‌లోని ఏజెన్సీ మండలాలు తడిసి ముద్దయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను పెను వాయుగుండంగా మారడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డివిజన్‌లోని కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. చింతూరు వద్ద శబరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. శబరి ఉపనదులైన సీలేరు, సోకిలేరు, చంద్రవంక, జల్లివారిగూడెం వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు, మండల కేంద్రాలకు గత రాత్రి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. సోకిలేరు వాగు పొంగిపొర్లడంతో చింతూరు–వీఆర్‌పురం మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సుమారు 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏడురాళ్లపల్లి–ప్యాగా మధ్య రహదారిపై వాగు నీరు చేరడంతో మరో 20 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.అదేవిధంగా చంద్రవంక, అత్తాకోడళ్ల వాగు, జల్లివారిగూడెం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అంతర్గత రహదారులు బురదమయంగా మారాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం సిబ్బందిని అప్రమత్తం చేసింది. ఎటువంటి విపత్తు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీడీఏ కార్యాలయంలో అధికారులకు సూచనలు చేశారు. చింతూరు మండలంలో 84.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్