కొండ, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
డ్రైనేజీ, పారిశుధ్యంపై నిరంతర పర్యవేక్షణ
కమిషనర్ షేక్ అలీమ్ బాషా
ప్రజాశక్తి – మంగళగిరి : మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత, పారిశుధ్య పనులతో భారీ వర్షాల సమయంలో వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకాలు గణనీయంగా తగ్గాయని నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ అలీమ్ బాషా తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, నగరంలో ఎక్కడా వర్షపు నీరు నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో గురువారం కమిషనర్ అలీమ్ బాషా మంగళగిరి టిడ్కో, ఎన్‌ఆర్‌ఐ జంక్షన్, రత్నాల చెరువు, తాడేపల్లి నులకపేట తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రధాన డ్రైన్లు, కాలువలు, వర్షపు నీటి ప్రవాహ మార్గాలను పరిశీలించి, నీరు సజావుగా వెళ్లేలా అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, డ్రైన్లలో పూడిక, చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు పూడికతీత పనులు చేపట్టాలని, పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
వర్షాలు, ఈదురుగాలుల కారణంగా చెట్లు లేదా కొమ్మలు నేలకొరిగిన ప్రాంతాల్లో వాటిని వెంటనే తొలగించి, రహదారులపై రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణపై సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
శిథిల భవనాలపై అప్రమత్తత
భారీ వర్షాల కారణంగా శిథిలావస్థలో ఉన్న గోడలు, పాత భవనాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూచించారు. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ప్రమాదకర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు.
డ్రైన్లలో చెత్త వేయొద్దు
వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించే విధంగా డ్రైన్లలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేయవద్దని అలీమ్ బాషా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యర్థాలను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని సూచించారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు.
24 గంటలూ కంట్రోల్ రూమ్
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సేవలు అందించేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 24 గంటలూ కంట్రోల్ రూమ్, కాల్ సెంటర్ అందుబాటులో ఉంటాయని కమిషనర్ తెలిపారు. వర్షపు నీరు నిలిచినా, చెట్లు నేలకొరిగినా, డ్రైనేజీ సమస్యలు తలెత్తినా వెంటనే 7093912653, 08645-295193 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపడతారని తెలిపారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా చూడటమే లక్ష్యమని కమిషనర్ స్పష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు.
ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ కె. వెంకటేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, డీఈఈ రాము, ఏఈ ప్రసన్న, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)