శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

‘హిట్‌..రన్‌ అండ్‌ ఎస్కేప్‌’.. జగన్‌ నైజం : సిఎం చంద్రబాబు

1 గంట క్రితం

‘Hit, run, and escape’ — that is Jagan’s nature: CM Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 04:29 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమరావతి : ‘హిట్‌, రన్‌ అండ్‌ ఎస్కేప్‌ అనేది గొడ్డలి పార్టీ అధినేత నైజం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. నేరపూరిత మనస్తత్వం ఉండేవారు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుంటున్నారని, ప్రభుత్వాన్ని, నేతలను లక్ష్యంగా చేసుకొని విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ .... ఇక్కడ సంఘటనలు చేయించి.. జగన్‌ బెంగళూరు వెళ్లి దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏదో ఒక అరాచకానికి.. టిడిపి నేతలను బాధ్యుల్ని చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ సైకోయిజానికి.. ఆధ్యాత్మికత, టెక్నాలజీ పరిష్కారం చూపిస్తాయన్నారు. ఇలాంటి సైకో మనస్తత్వమే ఇవాళ తెలంగాణలో ఆరుగురి హత్యకు దారితీసిందన్నారు. పోక్సో కేసు పెట్టారని.. కేసు పెట్టిన వారిని చంపేశాడని, తనకు సహకరించలేదని సొంత కుటుంబ సభ్యుల్నీ చంపేశాడని తెలిపారు. గొడ్డలి పార్టీ అధినేతకూ, ఈ హంతకుడి మనస్తత్వానికి దగ్గర పోలికలు ఉన్నాయన్నారు. ఇద్దరి మనస్తత్వాలు ఇంచుమించు ఒక్కటేనన్నారు. కన్న తల్లి, సొంత చెల్లి, బాబాయ్‌ వ్యవహారాలు చూశామన్నారు. జగన్‌ నమ్ముకుంది గొడ్డలి, సోషల్‌ మీడియా ద్వారా విష ప్రచారమేనని దుయ్యబట్టారు. ప్రజలకు సాంకేతికతతోపాటు ఆధ్యాత్మికత ఎంతో అవసరం అని చెప్పారు. అప్పుడే ఏది నిజమో తెలుసుకొని.. మంచి, చెడులు బేరీజు వేసుకోగలరు అని సూచించారు. గొడ్డలి పార్టీ అధినేత కుటుంబ చరిత్ర మొత్తం నేర స్వభావమేనన్నారు. తాత ముత్తాతల నుంచి ఇదే వైఖరి కొనసాగుతోందని, ఆ పార్టీ నేతల చరిత్ర కూడా అలాగే తయారవుతోందని అన్నారు. జగన్‌ ఎన్ని కుట్రలు పన్నినా భోగాపురం విమానాశ్రయం పూర్తయిపోయిందన్నారు. అమరావతి, పోలవరం, వెలిగొండ పూర్తవుతున్నాయని చెప్పారు. జగన్‌ .. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు. మావిగన్‌ పేరుతో పారిశ్రామికవేత్తలను గందరగోళానికి గురి చేయాలనుకుంటున్నారు అని దుమ్మెత్తిపోశారు. బ్రాహ్మణి స్టీల్స్‌ దోపిడీ కథ ఇంతటితో ఆగలేదు అని, బ్రాహ్మణి స్థలం సమస్యకే ప్రస్తుతానికి ఇన్నేళ్లకు చెక్‌ పడిందని చెప్పారు. ఆ పరిశ్రమ వల్ల ఓబుళాపురం మైనింగ్‌ బ్లాక్ అయ్యిందని, అలా జరగకుండా ఉంటే.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చేవన్నారు. 4 సిమెంట్‌ ఫ్యాక్టరీలు, పరిశ్రమలు వచ్చేవన్నారు. పెండింగ్‌లో ఉన్న లేపాక్షి భూముల సమస్యకు కూడా త్వరలోనే పరిష్కారం చూపిస్తామని ప్రకటించారు. లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడీ కోసం.. అభివృద్ధికి అడ్డుకట్టవేశారు అని ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం గొడ్డలి పార్టీ అధినేతకు ఇష్టం లేదు అని చెప్పారు. కేవలం తనకు పేరు వస్తుందనే అక్కసుతో ప్రతిదీ అడ్డుకోవాలని చూస్తున్నారు అని చంద్రబాబు విమర్శించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్