ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాలు తరచూ జరగడానికి యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి, అధికారుల అలసత్వం కారణమవుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. 10 ప్రమాదాల్లో 8 యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని, వీటికి సంబంధించి కేసులు నమోదు చేసే క్రమంలో హత్యా నేరంగా పరిగణించాలని సూచించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం ఉదయం సమావేశాలను సభాపతి స్థానం నుంచి ఉప సభాపతి రఘురామ కృష్ణరాజు ప్రారంభించారు. తొలుత ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా స్లీపర్ బస్సుల ప్రమాదాలపై మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రయాణికులు అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. బస్సుల తనిఖీల సందర్భంగా గతేడాది 22,272 కేసులు నమోదు చేస్తే.. కేవలం రూ.21.75 కోట్ల జరిమానా విధించారని, సరాసరి ఒక్కో కేసులో రూ.9,745 జరిమానా మాత్రమే విధించారన్నారు. రూ.కోట్లు సంపాదిస్తున్న యాజమాన్యాలపై జరినామాలు ఇంత తక్కువ మొత్తంలో విధిస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల కేసుల్లోనే రూ.10 వేలు జరినామానా విధిస్తున్నారని తెలిపారు. బస్సు యాజమాన్యాలపై అధికారులకు ఇంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి సమాధానమిస్తూ.. రాష్ట్రంలో 16 ప్రభుత్వ, 835 ప్రైవేట్ స్లీపర్ బస్సులు నమోదయ్యాయని, ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్లీపర్ బస్సుల అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. వాహనాలపై రిప్లక్టివ్ స్టిక్కర్లు లేకపోవడం వల్ల రాత్రి వేళ్లలో ప్రమాదాలు జరగడానికి ఒక కారణంగా ఉందని, వీటిని అతికించే విషయంలో తనిఖీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కోవూరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయాలని, గ్రామంలో జనాభా సంఖ్య 45 వేలు దాటిందని స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్‌శాఖ మంత్రి పి నారాయణ సమాధానమిస్తూ.. జనగణన కారణంగా కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి వరకూ స్థానిక సంస్థల సరిహద్దులను మార్చొద్దని ఆదేశించిందని వెల్లడించారు. వైసిపి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు గ్రామీణ పేదరిక నిర్మూలనశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానమిస్తూ.. రాష్ట్రంలో గడిచిన రెండేళ్లలో 72,202 స్వయం సహాయక సంఘాలకు రూ.456.30 కోట్లు వడ్డీలేని రుణాలు అందించినట్లు వెల్లడించారు. ఉన్నతి పథకం కింద ఎస్‌సి, ఎస్‌టిలకు ఇచ్చిన రుణాల్లో కొంత నిధులు పక్కదారి పట్టినట్లు తెలిసిందని, ఈ అంశంపై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖపట్నంలో వాయు కాలుష్యంలో స్థానిక ఎమ్మెల్యేలు గంటా వంశీకృష్ణ, గంటా శ్రీనివాసరావు, గణబాబు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొన్ని సమయాల్లో కాలుష్యం స్థాయి ఢిల్లీ కంటే అధికంగా ఉంటుందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తరపున మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిస్తూ.. కేవలం శీతాకాలంలోనే విశాఖలో అప్పడప్పుడు వాయు కాలుష్యం అధికమవుతుందని, అది సరాసరి 89 నుంచి 120 పాయింట్ల మధ్యే ఉంటుందని తెలిపారు. 33 శాతం గ్రీనరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, వాయు కాలుష్య నివారణకు అవసరమైన ఇతర అన్ని చర్యలూ తీసుకుంటామని తెలిపారు. 12 ఏళ్ల పాటు వేదం, 8 ఏళ్లపాటు ఆగమనం అభ్యశించిన పండితులకు ఆలయాల్లో ఉద్యోగాలు కల్పించకపోవడంతో నిరుద్యోగులుగా మారిపోతున్నారని ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి తెలిపారు. వీరికి ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమాధానమిస్తూ.. ఆలయాల్లో 344 పోస్టులు ప్రకటించగా, 172 పోస్టులను రాయలసీమలోనే ఉన్న ఆలయాల్లోనే భర్తీ చేశామన్నారు. భర్తీలో ఆయా ప్రాంతాల్లోని వేద పండితులకు, ఆగమ పండితులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఒడరేవులు రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్ వే, మూలపేట నిర్మాణంలో ఉన్నాయని, జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్‌లు నిర్మాణంలో ఉన్నాయని మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్ధన్ రెడ్డి తెలిపారు.







కామెంట్‌లు (0)