- మద్దతు తెలిపిన సిపిఐ జాతీయ నేత నారాయణ
- ఎట్టకేలకు ఒకరి మృతదేహం లభ్యం
ప్రజాశక్తి-పెద్దదోర్నాల (మార్కాపురం జిల్లా) : పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన మర్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం కటకానపల్లి గ్రామానికి చెందిన పుప్పాల రాజకుమార్, పుప్పాల వినయ్ కుమార్ మృతదేహాల వెలికితీతలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మృతుని కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా మృతదేహాల ఆచూకీ లభించకపోవడం, సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోందంటూ ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున దోర్నాల - మార్కాపురం రహదారిపై ధర్నా చేపట్టారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకూ రహదారిపై బైఠాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులతో చర్చించినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో వెలిగొండ ఫీడర్ కెనాల్ ను చూసి తిరిగి వెళ్తున్న సిపిఐ జాతీయ నాయకులు నారాయణ, నాయకులు..ఆందోళనకారులతో మాట్లాడారు. అనంతరం ఆందోళనకారులను తీసుకుని మార్కాపురం ఆర్‌డిఒ వద్దకు తీసుకువెళ్లారు. అధికారులు లేకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్తానని నారాయణ చెప్పడంతో వారు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.
వినయ్ కుమార్ మృతదేహం లభ్యం
గల్లంతైన యువకులలో వినయ్ కుమార్ మృతదేహం సోమవారం మధ్యాహ్నం ఆచూకీ లభించింది. సుంకేసుల సమీపంలో మృతదేహాన్ని ఎస్‌డిఆర్ఎఫ్ బృందాలు స్వాధీనం చేసుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. మరో యువకుడి ఆచూకీ తెలియాల్సి ఉంది. ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న సిపిఐ జాతీయ నేత నారాయణ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)