శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికాలో హైదరాబాద్ యువకుడి పై కత్తితో దాడి

15 గంటల క్రితం

Hyderabad youth attacked with a knife in the US.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 11:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

తెలంగాణ : ఉపాధి కోసం అమెరికాకు వెళ్లిన ఒక హైదరాబాద్ యువకుడు అక్కడ జాత్యహంకార దాడికి గురయ్యాడు. యుటా రాష్ట్రంలోని ఒక షాపింగ్ మాల్‌లో విధుల్లో ఉన్న టోలిచౌకి వాసి సోహైల్ ఉద్దీన్ (38) పై ఒక దుండగుడు ‘నువ్వు భారతీయుడివే కదా’ అంటూ కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాధితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతానికి చెందిన సోహైల్ ఉద్దీన్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గత రెండేళ్లుగా అమెరికాలోని సాల్ట్‌లేక్ కౌంటీలో నివసిస్తున్నాడు. వెస్ట్‌వ్యాలీ సిటీలోని ఒక మాల్‌లో ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 14న ఆయన విధుల్లో ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన ఒక గుర్తుతెలియని దుండగుడు ... సోహైల్ జాతీయతను ప్రశ్నిస్తూ ఒక్కసారిగా కత్తితో దాడికి తెగబడ్డాడు. రక్తపు మడుగులో పడిపోయిన సోహైల్‌ను గమనించిన తోటి ఉద్యోగులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, ఆసుపత్రికి తరలించారు. కాగా, దాడికి పాల్పడిన నిందితుడిని స్థానిక పోలీసులు వెంబడించి మరీ అరెస్ట్ చేశారు. ఈ దుర్ఘటనపై శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. బాధితుడి కుటుంబ సభ్యులతోపాటు స్థానిక అధికారులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, సోహైల్ కోలుకునేందుకు అవసరమైన అన్ని రకాల వైద్య సాయం అందేలా చూస్తున్నామని ప్రకటించింది. టోలిచౌకిలోని సోహైల్ నివాసంలో ప్రస్తుతం ఆయన తల్లి ఒక్కరే నివసిస్తుండటంతో, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో భారతీయ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులు జరగడం అత్యంత ఆందోళనకరమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, అమెరికాలో ఉన్న సోహైల్ వద్దకు హైదరాబాద్ నుంచి ఆయన కుటుంబ సభ్యులు వెళ్లేందుకు వీలుగా తక్షణమే ‘అత్యవసర వీసా’ మంజూరు చేయాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) అధికార ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్ తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్