- మంత్రి పార్ధసారధి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు, అడుగు వేస్తే అరాచకమని గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. టిడిపి కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఎపిపిఎస్‌సిని భ్రష్టుపట్టించిన ఘోరాలను కప్పిపుచ్చుకోవడానికే మెగా డిఎస్సిపై జగన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎపిపిఎస్‌సి కుంభకోణాన్ని డిఎస్సితో పోల్చాలని చూడటం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని తెలిపారు. హైకోర్టు సైతం ఎపిపిఎస్‌సి అవకతవకలపై మొట్టికాయలు వేసి సిట్ ఏర్పాటుపై మార్గదర్శకాలు ఇచ్చిందని వివరించారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో మాత్రం వైసిపి వేయించిన 300 కేసుల్లో కుట్రకోణం దాగి ఉందని న్యాయస్థానమే స్పష్టం చేసిందని పేర్కొన్నారు. యువత భవిష్యత్తును నిర్ణయించే గ్రూప్-1 పరీక్షా పత్రాలను స్ట్రాంగ్ రూమ్‌లలో కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ అగ్రిగోల్డ్ రిసార్ట్‌కు తరలించి తమకు అనుకూలమైన వ్యక్తులతో మూల్యాంకనం చేయించారని ఆరోపించారు. చైర్మన్ ఆమోదం లేకుండా, ఎటువంటి ప్రామాణిక నిబంధనలు పాటించకుండా చేపట్టిన డిజిటల్ ఎవాల్యుయేషన్‌లో ప్లంబర్లు, కార్పెంటర్లు, రోజువారీ కూలీలు, పరీక్ష రాసిన వారి కుటుంబ సభ్యులతోనే పేపర్లు దిద్దించినట్లు సిట్ నివేదికలోనే బట్టబయలైందన్నారు. ఐదేళ్ల పాపాలు ఎక్కడ బయటపడతాయోననే భయంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు రాకుండా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. శాసనమండలిలో రాష్ట్ర రైతాంగాన్ని అతలాకుతలం చేస్తున్న ఎల్ నినో వాతావరణ పరిస్థితులపై చర్చ జరగకుండా అడ్డుకుని, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కోసం మాత్రమే మండలిని వాడుకున్నారని విమర్శించారు. అధికారాన్ని స్వార్థం కోసం వినియోగించుకోవడమే వైసిపి విధానమని ఆరోపించారు.







కామెంట్‌లు (0)