సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థుల తిండి మీద కన్నేస్తే... చర్యలు తప్పవు

53 నిమిషాల క్రితం

foods
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 12:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- సంక్షేమ హాస్టళ్లు, రేషన్ షాపులపై ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

ప్రజాశక్తి-గిద్దలూరు (మార్కాపురం జిల్లా) : విద్యార్థులు తినే తిండి మీద కన్నేస్తే... కఠిన చర్యలు తప్పవని ఎపి స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. మర్కాపురం జిల్లా గిద్దలూరులోని పలు సంక్షేమ వసతిగృహాలు, గిరిజన గురుకుల పాఠశాలలు, రేషన్ షాపుల్లో సోమవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొన్ని చోట్ల విద్యార్థులకు వారానికి ఆరుసార్లు ఇవ్వాల్సిన కోడిగుడ్లను కేవలం మూడు నుంచి నాలుగుసార్లే ఇస్తున్నట్లు తనిఖీల్లో తేలిందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాచర్ల గేట్ సెంటర్ సమీపంలోని పోస్ట్ మెట్రిక్ బిసి బాలుర వసతిగృహాన్ని సందర్శించగా... వార్డెన్ అందుబాటులో లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తనిఖీలు ముందే తెలుసుకుని కొందరు రేషన్ డీలర్లు షాపులకు తాళాలు వేసి వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడిఎస్ (రేషన్), మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పిఎం పోషణ్ యోజన పథకాలను కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. మెనూ డీవియేషన్లు మోసాలు, లబ్ధిదారులకు అందాల్సిన సరుకుల్లో కోత విధిస్తే షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్‌తో పాటు సుమోటోగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రేషన్ షాపుల్లో అవకతవకలు లేదా మెనూలో తేడాలు కనిపిస్తే ప్రజలు వెంటనే వీడియోలు తీసి ఎపి స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్ 9490551117 కు పంపాలని సూచించారు. ఫిర్యాదు అందిన వెంటనే తక్షణ స్పందన ఉంటుందని భరోసా ఇచ్చారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు, ప్రజలకు ప్రభుత్వాలు అందించే పౌష్టికాహారంలోనూ అక్రమాలకు పాల్పడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్